మల్లేశం దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. బివై నగర్ జెండా చౌరస్తా కాడ బాలయ్య హౌటల్ కాడా చారు తాగుతూ తనలో తానే మాట్లాడుకున్నట్టు చుట్టూ ఉన్న ప్రపంచంతోని సంబంధం లేనట్లు కనిపిస్తున్నాడు. నిజంగానే మునుపటి లెక్క సాంచాలు నడుస్తాయా అని తనలో తానే పదేపదే అనుకుంటుండు మల్లేశం. వలసల్లోనే సగం జీవితం గడిచిపోయింది. అరవైయేండ్లకి కాటికి దగ్గరైతుండు. ఆ మిగిలిన కొంచెం జీవితమైనా సొంత గడ్డ మీద గడపాలని కాయిసుతోనే బీవండి నుంచి సిరిసిల్ల బాట వట్టిండు మల్లేశం. అప్పట్లో పదో తరగతి చదివినంక ఇక్కడ బతుకుదెరువు కష్టమై బీవండీ బాట పట్టించిన పరిస్థితులు 30ఏండ్లలో సిరిసిల్లలో వచ్చిన మార్పులు మల్లేశం కండ్ల ముందు తిరుగుతున్నాయి. అప్పుడప్పుడే ఊపిరిపోసుకుంటున్న కాటన్ సాంచెలు, ఉనికిలోకి వచ్చిన సైజింగ్, డైనింగ్ పరిశ్రమలు ఊరునిండా ఉపాధిని ఇస్తాయి అనుకుంటే దెబ్బకొట్టిపోయిన హుండీ విధానం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను భారీగా దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు చిన్న బాపు ఉన్న రెండు సాంచాలు అమ్ముకొని మూటాముల్లె సర్దుకొని తొలుత కుటుంబంతోని బీవండి పోయిండు. నడిపి బాపు ఇక్కడనే డైయింగ్ మొదలుపెట్టి కుటుంబమంతా కలిసి పనిచేసే ఉపాయం జేసిండు. మా బాపు ఉన్న ఒక జోడికి ఇంకో జోడి సాంచాలు తీసుకొచ్చిండు. నేను, తమ్ముడు, బాపు అందరం సాంచెల మీదనే ఆధారపడి కుటుంబమంతా ఉంటుండే. దసరా అప్పుడు మొదలై దీపావళి దాకా కష్టకాలం ఉంటుండే. ఈ కాలమంతా కార్మికులు సచ్చుడు వార్తలు వస్తుండే. ఈ సాంచలల్ల ఎంత చేసినా లోపటికే పోతుందని మా బాపు నెత్తీనోరు మొత్తుకుంటూ ఉంటుండే. తొంభై తర్వాత బీవండి కెళ్ళి వచ్చిన మా చిన్నబాపు ఇక్కడెం తిప్పలుపడుతర్రా.. సప్పుడుజేక దేశం మోఖాన రాండ్రి అని చెపుతుండే. ఇక్కడ పరిస్థితుల్లో మార్పు కనిపియ్యకపోవడంతో ముందుగా నేను బీవండి బాట పట్టి.. అట్లా మొదలైన జీవితం బీవండిలో పండే కోటీర్ల నుంచి మొదలై గణేష్ టాకీస్, శ్రీరంగ నగర్, నారాయణ కాంపౌండ్, బండారి కాంపౌండ్, వరల్ దేవి గుడి జీవితంలో భాగమై సాగుతున్నాయి. అప్పటికే ఇంటర్ వరకు చదివిన తమ్ముడిని నాతోనే బీవండి తీసుకొచ్చి నుట్టి. వాడు నా దగ్గరనే ఉంటూ వార్పిన్ పని నేర్చుకున్నడు. ఇంతట్ల నా లగ్గం కూడా ఐనుండే. మా మామ నారాయణ కాంపౌండ్‌లో ఒక కొటిరు కూడా కట్నం కింద ఇచ్చిండు. అట్లా కాలం గడిచిపోతుంది. పండుగకో పబ్బానికో సిరిసిల్ల వస్తుంటిని. కొన్ని రోజులకు తమ్ముడు సిరిసిల్లకు వచ్చిండు. మెల్లగా వార్పిన్ పని దొరికించుకున్నడు. అప్పటికే బీవై నగర్‌లో మాకున్న ఇంట్లోనే ఉంటున్నడు. సిరిసిల్లల ఎవరి ప్రమేయం ఉన్నా లేకున్నా కాలం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు మార్పులు ఎప్పటికప్పుడూ జరుగుతూ పోతున్నాయి. అప్పుడప్పుడు సిరిసిల్లకు వచ్చి పోతూనే ఉన్నా సాంచాల దందా క్రమక్రమంగా పెరిగిపోతోంది. 2000 నాటికి కాటన్ తగ్గిపోతూ వచ్చింది. పాలిస్టర్ పెరుగుతూ పోయింది. తెలంగాణ కోసం జరుగుతున్న కొట్లాటల ఫలితంగా 2014లో తెలంగాణ రానే వచ్చింది. అప్పటికి తమ్ముడు చెప్తున్నాడు అన్న దేశం రాయే తెలంగాణ వచ్చింది మనకి ఫికర్ లేదు. నాలుగు జోడీలు వేసుకొని కూళ్లగడితే బతుకు వెళ్లిపోతది ఎన్ని రోజులున్నా మన దేశం మనం పోవుడే కదా అని చెబుతుండే.
అప్పటికీ నా మదిలనైతే అనేక భయాలు సుడులు తిరుగుతుండే. 5000 సాంచాల నుంచి 40వేల వరకు పెరిగిన సిరిసిల్ల. కాటన్ పరిశ్రమను నమ్ముకుని ఉన్న కార్మికులు.. డైయింగ్ సైజింగ్ పరిశ్రమలు ఉనికి కోసం కొట్లాడుతూ కనుమరుగుతున్న పరిస్థితులు కండ్లముందు కదులుతుండే. సంక్షోభాలు వచ్చిన కార్మికులే ఎందుకు ఉరి తాళ్ళకు వేలాడుతున్నరనే అనేక ప్రశ్నలు మెదులుతుండే..
బతుకమ్మ చీరలతో సిరిసిల్ల మస్తు పని దొరుకుతుందని తనతో బీవండిలో ఉండిపోయిన మస్తు మంది సిరిసిల్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. నేను కూడా కొంచెం ధైర్యం చేసిన. పిల్లగాండ్లు పెద్దోళైతుండ్రు.. ఎన్ని రోజులు దేశంగాని దేశంలో ఉండాలే సొంతూరుకి పోవాల్నయే. అట్లా దేశం దిక్కు ప్రాణం కొట్టుకుంటోంది.
ఉన్నయన్నీ అమ్ముకొని కుటుంబంతోని సంబరంగా సిరిసిల్ల బాట పట్టిన. సొంత గడ్డమీద బతుకు తెరువును వెతుక్కుంటూ సిరిసిల్లకు పోతుంటే మనసు నిండా సంబరమే. గణేష్ నగర్‌లో ఓ ఫ్లాట్ ఉండే. రేకుల షెడ్డేసి నాలుగు జోడీలు వేసిన. అప్పుడప్పుడే బతుకమ్మ చీరల ఆర్డర్లు మొదలైనరు.. మొదటిసారి వచ్చినప్పుడు అందరికీ పని దొరక్కకపోయినా సూరత్ కెళ్లి చీరలు తెచ్చి మోసం చేస్తుండ్రని ఆరోపణలు అయితే వచ్చినరు. సంఘాలకే పని ఇస్తామని రూల్ పెట్టిండ్రు. అట్లా నేనో సంఘంలో చేరిన. కిందవడి మీదవడి ఏదో సాంచాలు నడుస్తున్నట్టు అనిపించింది. మెల్ల మెల్లగా అన్లకు సంఘాలు వచ్చినరు. ఆ సంఘాలకు లీడర్లే ఓనర్లలైరీ. క్రమక్రమంగా సాంచాలంటేనే విసుగొచ్చిన పరిస్థితి వచ్చింది. సేట్ల కన్ను బతుకమ్మ చీరల ఆర్డర్‌పై వడ్డది. మెల్ల మెల్లగా సేట్ల చేతుల్లోకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పోతున్నట్టు అనిపించింది.
వచ్చిన రెండేండ్లకి సాంచాల పరిస్థితి దిగజారి పోయింది. మెల్ల మెల్లగా ఆసాములకు బతుకమ్మ చీరలు వచ్చుడు కష్టమైంది. వచ్చిన రెండు బీములు మూడు బీముల కోసం పెట్టే ఖర్చులకు గిట్టుబాటుకాని పరిస్థితి దాపురించింది. సాంచాలంటేనే విసుగు వచ్చే పరిస్థితి. ఇక నాసొంటి ఆసాములు సాంచాల మీద బతుకుడు కష్టమని అర్థమైంది. ఆయింత సాంచాలు, పాత సామాన్లు అమ్మేసిన. క్రమక్రమంగా నాలాగే చిన్నచిన్న ఆసాములు సాంచాలను బెంగాల్‌కు అమ్మే పరిస్థితిలు సర్వసాధారణం అయిపోనాయి. చిన్నచిన్న ఖార్కానాల స్థానంలో పెద్ద పెద్ద సెట్ల ఖార్ఖాన్లు పుట్టుకొచ్చినై. సిరిసిల్లలో కార్మికుల స్థానంలో బీహారీ కార్మికులు వచ్చుడు మొదలైంది. టీవీలల్లో వార్తలల్లో బతుకమ్మ చీరల గురించే ముచ్చట. సిరిసిల్ల మొత్తం మారిపోయింది. సిరిసిల్లంత అదృష్టవంతులు లేరు అనే మాటలు వినపడుతుండే. ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ కేటీఆర్ అసోంటి మంత్రి దొరకడు అని చెప్పుకుంటుండ్రి. అంత అట్లనే ఒకతను పెద్దపెద్ద ఖార్ఖాండ్లకు కరెంటు సబ్సిడీ ఎట్లా ఇస్తారని కేసు వేసిండు. ఎవ్వరి ఉపాయమో తెలియదు కానీ కొంచెం కాలం ముందుకు పోంగానే కొద్దోగొప్పో మిగిలిన ఆసాములను సంఘాలకెళ్లి వేరుచేసి ఎస్‌ఎస్‌వై యూనిట్ల పేరుతోని సొంత దుకాణం పెట్టించిండ్రు. సారు దిగిపోయేసరికి లక్షల్లో కరెంట్ బకాయిలు పేరుకొని పాయె. సారు పాయే కారు పాయే. మల్ల కొత్త సర్కార్ వచ్చే. గత ప్రభుత్వమే బతుకమ్మ చీరల ఆర్డర్ల పేరుతోనే మొత్తం కుంభకోణం చేసిందని చెప్పుకుపోవట్టే. పోయిన ప్రభుత్వమే కోట్ల రూపాయలు పెట్టి పోయింది. వాళ్లు చేసిన బాకీ మేము ఎట్టా కట్టాలేె అనవట్టే. అయినా కొంచెం కొంచెం కడతామని చెప్పబట్టే. ఈ ప్రభుత్వం వచ్చి ఆదుకుంటామనే మాటలైయితే చెబుతూనే ఉంది. మొత్తానికైతే తన బతుకు చిత్రమంతా చిక్కు ముడులతో మల్లేశంకు కండ్ల ముందు కనిపించినట్టు అనిపించింది.
తన అసాంటోళ్లను ఆసాముల నుంచి కార్మికులుగా, కార్మికులుగా ఉన్న వాళ్లను ప్రశ్నార్థకంగా మార్చిన అభివృద్ధి చరిత్ర అంతా తనచుట్టే తిరుగుతున్నట్టు అనిపించింది. మల్ల తను ఊరు విడిచి పెట్టినప్పటి పరిస్థితులే కనిపియ్యవట్టే అని మనసులోనే అనుకుంటూ చారు గిలాస చెక్క టేబుల్ మీద పెట్టి ఇంటితొవ్వ పట్టిండు పాపం మరమగ్గాల ఆ సామి మల్లేశం.