
– ఆరు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో మోసం చేశారు
నవతెలంగాణ-కోహెడ : కాంగ్రెస్ పార్టీ ని నమ్మితే కైలాసం ఆటలో పామును మింగినట్టేనని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వోడితెల సతీష్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గజమాలతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ చౌరస్తా వద్ద మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో ఆదర్శంగా నిలిచాయ్ అన్నారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేడని, ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారుతాడాని ఎద్దేవా చేశారు. శృతి లేని కాంగ్రెస్ ను నమ్మితే మనం ఆగమవుతామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు అలాంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అగ్రహారంగా నిలిపారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72 కోట్ల రుణమాఫీ చేశామని మిగతావి కూడా పూర్తి చేస్తామన్నారు. అలాగే రేషన్ షాప్ లో సోనామసూరి బియ్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలంటే 5 ఏళ్ల భవిష్యత్తు అని దీనిని పూర్తిగా ఆలోచన చేసి సరైన నాయకున్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం చొప్పదండి బి.ఎస్.పి పార్టీ ఇంచార్జి మంద రవీందర్, ఎఐ ఏస్బి రాష్ట్ర కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ల తో పాటు 50 మందికిపైగా ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేర్యాల నవ్య దేవేందర్ రావు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ పేర్యాల రాజేశ్వరరావు, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.