– రైల్వే స్టేషన్లలో సీసీ టీవీల నిఘా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకులు రైళ్ళలో టపాసులు/మండే స్వభావం గల వస్తువులను వెంట తీసుకెళ్లడం నేరమనీ, అలా చేస్తే నేరుగా జైలుకు పంపుతామని దక్షిణ మధ్య రైల్వే మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లో కూడా ఇలాంటి పదార్థాలను ఉంచడం భద్రతకు తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. రైళ్లలో ప్రయాణించే తోటి ప్రయాణీకులతో పాటు, రైల్వే ఆస్తులకు కూడా నష్టం కలుగుతుందనీ, అందువల్ల ప్రయాణీకులు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ తరహా వస్తువులతో పట్టుబడితే రైల్వే చట్టం 1989 సెక్షన్ 164, 165 ప్రకారం రూ. వెయ్యి జరిమానాతో పాటు మూడేండ్లు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. ఎవరైనా రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో ఇలాంటి వస్తువులను గమనిస్తే హెల్ప్‌లైన్ నెంబర్ 139కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వీటి నివారణ కోసం రైళ్లు, రైల్వే స్టేషన్లలో స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు, సీసీటీవీ నిఘా కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు.