– నల్లమలతోపాటు మైదాన ప్రాంతంలోనూ..
– విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో దగ్ధమౌతున్న ఆస్తులు
– వరుస ప్రమాదాలతో కోట్లలో ఆస్తి నష్టం
– అగ్నిమాపక సిబ్బంది అప్రమతం
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వేసవి కాలం ఇంకా మొదలే కాలేదు. కానీ, అప్పుడే అగ్నిప్రమాదాలు మొదలయ్యాయి.. ప్రతి వేసవి కాలంలో నల్లమలలో వందలాది ఎకరాల్లో చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. మైదాన ప్రాంతంలో సైతం వరుస అగ్ని ప్రమాదాలు జరిగి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో లక్షల విలువైన ఆస్తులు కాలిపోతున్నాయి. మంటలను ఆర్పే యంత్రాలు ఆశించిన స్థాయిలో లేవు. విశాలమైన నల్లమలలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వేసవి కాలం అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు, గిరిజనులు, వణ్యప్రాణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ మంటలు చెలరేగుతాయో తెలియని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే నల్లమలలో ఐదు సార్లు మంటలు చెలరేగి 250 హెక్టార్లకు పైగా అడవి కాలిపోయింది. పిబ్రవరి 18న చెలరేగిన మంటల వల్ల మూడు చెంచు గుడిసెలతోపాటు 100 ఎకరాల అడవి పూర్తిగా దగ్ధమైంది. గత నెల 27న రాంపూర్ అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. ఫారెస్టు అధికారులు ఎంత ప్రయత్నించినా.. మంటలు అదుపులోకి రాలేదు. చివరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. 21న అప్పాయిపల్లి బీట్ పరిధిలోనూ.. మంటలు చెలరేగాయి. ఒక సారి అగ్ని చెలరేగితే.. అడవి ప్రాంతం మొత్తం అలజడిగా మారుతోంది. గొర్రెలు, మేకల పెంపకందారులు భయాందోళనకు గురవుతున్నారు.
మైదాన ప్రాంతంలోనూ మంటలు చెలరేగుతున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఊరంతా అంధకారం అయింది. వ్యవసాయ సామాగ్రి, పశువుల గడ్డి తదితర వస్తువులు బూడిదయ్యాయి. కూలర్లు, టీవీలు, ప్రిడ్జీలు కాలిపోయాయి. గ్రామంలో అధికారిక లెక్కల ప్రకారం రూ.70 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. లింగాల మండలం క్యాంపు రాయారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ వైర్లు తగిలి పైపులు, వైర్లు, స్పింక్లర్ సామాగ్రి, గడ్డి పూర్తిగా కాలిపోయాయి. ఈ సమయాల్లో మంటల త్వరగా నివారించడానికి సరైన సౌకర్యాలు లేవు. అగ్నిమాపక యంత్రాల లోపం తీవ్రంగా ఉంది. విస్తారమైన నల్లమల అటవీ ప్రాంతంలో రెండే ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. మరో రెండు స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫైర్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత కూడా ఉంది. అన్నిటికీ మించి ఆధునిక యంత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచితే ప్రమాదాల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆధునిక ఫైర్ ఇంజన్ మరొకటి కావాలి
వేసవిలో మంటలు ఆర్పడానికి తగిన సౌకర్యాలున్నాయి. ముఖ్యంగా సిబ్బందిని ఇటీవల నియామకం చేశాం. ఫైర్‌స్టేషన్‌లో ఒకటే ఫైరింజన్ ఉంది. మరొకటి అయితే మంటలను వెంటనే ఆర్పే అవకాశాలున్నాయి. ఒకేసారి రెండు ప్రదేశాలలో మంటలు చెలరేగితే ఒక దగ్గర నష్టం జరుగుతోంది. అందుకే రెండో యంత్రం ఉంటే ప్రయోజనం.
– కిశోర్ డీఎఫ్‌ఓ
మమబూబ్‌నగర్ జిల్లా