అధికారంలోకి వస్తే కులగణన

If you come to power, caste census– అప్పుడే అందరికీ భాగస్వామ్యం : రాహుల్‌
– మేము బటన్‌ నొక్కితే పేదలకు ప్రయోజనం, బీజేపీ నొక్కితే అదానీకి లాభమని వ్యాఖ్య
బిలాస్‌పూర్‌ : దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మహిళల భాగస్వా మ్యాన్ని ఇది మరింత పెంచుతుం దని ఆయన చెప్పారు. ఛత్తీస్‌ఘర్‌ లోని బిలాస్‌పూర్‌ జిల్లా పర్సాడా గ్రామంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవాస్‌ న్యారు సమ్మేళన్‌ కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రిమోట్‌ నొక్కితే పేదలు ప్రయోజనం పొందుతారని అన్నారు. అదే పని బీజేపీ చేస్తే అదానీకి ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే కాంట్రాక్టులు దక్కుతాయని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కులగణన చేసిందని, అది దేశంలోని ప్రతి కులంలో ఎంత జనాభా ఉన్నదో నమోదు చేసిందని తెలిపారు. ఆ నివేదిక మోడీ వద్ద ఉన్నప్పటికీ దానిని బయటపెట్టడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు.
‘ఇతర వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మహిళలకు భాగస్వామ్యం కల్పించాలంటే కులగణన జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ పని మోడీ చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని అదే’ అని రాహుల్‌ చెప్పారు. ప్రభుత్వాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకుండా కార్యదర్శులు, క్యాబినెట్‌ కార్యదర్శులే నడుపుతున్నారని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలలో 90 మంది కార్యదర్శులు పని చేస్తుంటే వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలని గుర్తు చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు దేశ బడ్జెట్‌లో కేవలం ఐదు శాతాన్ని మాత్రమే నియంత్రిస్తున్నారని అంటూ దేశ జనాభాలో ఓబీల సంఖ్య ఐదు శాతమేనా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కులగణనే సమాధానం చెబుతుందని అన్నారు. అయితే ఈ ప్రక్రియ చేపట్టడానికి మోడీ భయపడుతున్నారని చెప్పారు.
తాను ఈ రోజు రిమోట్‌ నొక్కి ఛత్తీస్‌ఘర్‌ ప్రజల చేతుల్లోకి వేలాది కోట్ల రూపాయలు చేర్చానని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ‘మేము ప్రజల సమక్షంలో రిమోట్‌ నొక్కాము. అదే పని బీజేపీ రహస్యంగా చేసింది. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి ముంబయి విమానాశ్రయం, రైల్వే కాంట్రాక్టులు కట్టబెట్టింది’ అని విమర్శించారు. అదానీతో మోడీ సంబంధాన్ని ప్రశ్నించినందుకే తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని రాహుల్‌ ఆరోపించారు.