– ఇది విధాన రూపకల్పనలో సహాయపడుతుంది : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వస్తే కుల గణనను నిర్వహించాలనే తన పార్టీ సంకల్పాన్ని రాహుల్ గాంధీ నొక్కిచెప్పారు. ఈ సరైన అడుగుతో ఆర్థిక మ్యాపింగ్‌తో పాటు రిజర్వేషన్‌పై 50 శాతం పరిమితిని తొలగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ నినాదం ”గణన” అనీ, ఎందుకంటే అది న్యాయం వైపు మొదటి అడుగు అని రాహుల్ చెప్పారు. ”ఎవరు పేదవారు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? పేదలు ఎందరు, వారు ఏ స్థితిలో ఉన్నారు? ఇవన్నీ లెక్కించాల్సిన అవసరం లేదా?” అని రాహుల్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
బీహార్‌లో నిర్వహించిన కుల గణనలో 88 శాతం మంది పేదలు దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల నుంచి వచ్చినట్టు తేలిందని గాంధీ చెప్పారు. ”బీహార్ నుంచి వచ్చిన గణాంకాలు దేశ వాస్తవ చిత్రణ చిన్న సంగ్రహావ లోకనం మాత్రమే. దేశంలోని పేద జనాభా ఏ స్థితిలో జీవిస్తున్నారనే దానిపై మనకు ఆలోచన కూడా లేదు” అని ఆయన అన్నారు. అందుకే కుల గణన, ఎకనామిక్ మ్యాపింగ్ అనే రెండు చారిత్రాత్మక చర్యలు తీసుకోబోతున్నామనీ, వాటి ఆధారంగా 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.ఈ చర్య దేశాన్ని ”ఎక్స్-రే” చేస్తుందనీ, ప్రతి ఒక్కరికీ సరైన రిజర్వేషన్లు, హక్కులు, భాగస్వామ్యాన్ని అందిస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ”ఇది పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలను రూపొందించటంలో సహాయ పడటమే కాకుండా విద్య, సంపాదన, ఔషధాల పోరాటం నుంచి వారిని రక్షించటంలో, అభివృద్ధి ప్రధాన స్రవంతిలో వారిని కనెక్ట్ చేయడంలో కూడా సహాయప డుతుంది. కాబట్టి, మేల్కోండి.. మీ గళాన్ని పెంచండి.. కుల గణన మీ హక్కు. ఇది మిమ్మల్ని కష్టాల చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తుంది” అని ఆయన అన్నారు. ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రభుత్వం అర్థం చేసుకోవటానికి సమగ్ర సామాజిక-ఆర్థిక కుల గణన దోహదపడుతుందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ అన్నారు.