– సంస్కారహీనంగా మాట్లాడితే ఇంటికొచ్చి కొడతాం
– మంత్రి కోమటిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు
– అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు
– వ్యతిరేకత ఉంటే నిరసనలు, ధర్నాలు చేయండి
– సిమెంట్ ఫ్యాక్టరీకి మంత్రికి ఏమి సంబంధం
– మంత్రిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
– లేనిపక్షంలో గుణపాఠం తప్పదు
– డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్
– పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల,మున్సిపల్ చైర్మన్ బుర్రి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ మాజీ నేతలు మతిస్థిమితం కోల్పోయి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోచుకొని దాచుకున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మంత్రి కోమటిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాదరి కిషోర్ బతుకేంటో అందరికీ తెలుసని అన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తన్ని తరిమి కొట్టిన కేటీఆర్, కేసీఆర్ మెప్పుకోసం మంత్రులపై స్థాయి మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా సంస్కారహీనంగా మాట్లాడడం మానుకోవాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రామన్నపేట నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి జరుగుతున్న సంఘటనలు వేరు ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడిన విషయాలు వేరని అన్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశాడని, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత గాదరి కిషోర్ లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు గెలుపొందారని అన్నారు. దీంతో తాము మా ప్రాంత వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందాడని సంతోషపడ్డామని వివరించారు. కానీ, గాదరి కిషోర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.మూసి ప్రక్షాళనతో నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుందని, కానీ ప్రతిపక్ష నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఇప్పటికైనా గాదరి కిషోర్ చేస్తున్న అసత్య ఆరోపణలు, వ్యక్తిగత విమర్శనలు మానుకోవాలని, లేనిపక్షంలో ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు.నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడు లు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, మీ భాష మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతిలో తన్నులు తప్పమన్నారు. గత 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా… అధికారం కోల్పోయిన తర్వాత సిగ్గు, శరం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలాంటి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు అరెస్టు చేసేవారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన సాగిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలాంటి నిర్బంధాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధుల బతుకులేంటో, వారు చేసిన అవినీతి దందాలేంటో మాకు తెలుసనని స్పష్టం చేశారు.
స్థాయిని మరిచి, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొట్టడం ఖాయమని అన్నారు. గతంలో జిల్లా ప్రాజెక్టుల గురించి, డబల్ బెడ్ రూమ్ లు, ఇతర అభివృద్ధి పథకాలపై నోరు మెదపని సన్నాసులు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, మీ భాష మార్చుకోకపోతే మా దమ్మేంటో చూపిస్తామని పేర్కొన్నారు. నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సంస్కారహీనులు, చిల్లర ఎదవలు స్థాయిని మరిచి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఏమి చేయలేని దద్దమ్మలు అధికారం కోల్పోయిన తర్వాత నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేద ప్రజల ఆశాజ్యోతి అని, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉంటాడని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేసిన గాదరి కిషోర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొజ్జ శంకర్, జూలకంటి శ్రీనివాస్,కేసాని వేణుగోపాల్ రెడ్డి, బుర్రి యాదయ్య, ఏర్పుల రవి,కాంగ్రెస్ నాయకులు జూలకంటి సైదిరెడ్డి, కిన్నెర అంజి,గాలి నాగరాజు, మామిడి కార్తీక్ పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, మహమ్మద్,చింతపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.