పోటి ప‌డితే ప‌త‌కం పట్టాల్సిందే

If you win, you have to win a medalఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్‌వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌’గా నిలిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలను గెలుచుకుని ఔరా అని పించారు. పాల్గొన్న పోటీలన్నింటిలోనూ పతకాలను గెల్చుకుని ‘స్ట్రాంగ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆమే షేక్‌.సాదియా అల్మాస్‌. ఇప్పటివరకూ అంతర్జాతీయ స్థాయిలో 11, జాతీయస్థాయిలో 20 వరకూ పతకాలు గెలుచుకుని తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక రాష్ట్రస్థాయి పతకాలకు లెక్కే లేదు. మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే ప్రపంచ చాంఫియన్‌గా రాణిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఇస్లాంపేట (తెనాలిరోడ్డు)కు చెందిన సాదియా అల్మాస్‌ 2002, అక్టోబర్‌ 27న పుట్టారు. తల్లి రిజ్వానా, తండ్రి షేక్‌ సందాని. సాధియ ప్రస్తుతం కెఎల్‌ యూనివర్శిటీలో ఎంబీఎ చదువుతున్నారు. సివిల్‌ సర్వీసెస్‌లో రాణించాలనే లక్ష్యంతో కెఎల్‌ యూనివర్శిటీలో బీఏ అభ్యసించారు. ప్రాథమిక విద్య మంగళగిరి అరవింద పబ్లిక్‌ స్కూల్లో, ఇంటర్మీడియట్‌ విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాలలో, మంగళగిరిలోని వీజెలో పూర్తిచేశారు.
తండ్రి ప్రోత్సాహంతో
చిన్నప్పటి నుంచి సాదియాకు ఆటలంటే ఎంతో ఇష్టం. కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి ఆటల్లో ప్రావీణ్యం చూపించేవారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆటల పోటీల్లో ప్రోత్సహించారు. సాదియా తండ్రి కూడా పవర్‌ లిఫ్టర్స్‌. సందాని పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటు చేసి 25 ఏండ్లుగా ఎంతోమందికి ఉచితంగా పవర్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌కు కార్యదర్శిగా ఉన్న తండ్రి ప్రోత్సాహంతో సాదియా పవర్‌లిఫ్టింగ్‌ వైపు ఆకర్షితులయ్యారు. మొదట గుంటూరు జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. పతకాలు సాధించటంతో ఆమెలో ఆత్మ విశ్వాసం పెరిగింది. తండ్రి ఆమెను జిల్లా, రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రతిభ చూపేలా ప్రోత్సహించారు. అలా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు. ఏపీ స్టేట్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ నాయకులు కూడా తమవంతుగా ప్రోత్సాహాన్ని అందించాయి. దీంతో సాదియా వెనుతిరిగి చూడకుండా మొక్కవోని దీక్షతో నేర్చుకున్నారు. ప్రస్తుతం పతకాల పంట పండిస్తున్నారు. ఆర్థిక కారణంగా విదేశీ పోటీలకు వెళ్లటానికి సాదియా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.3 లక్షల వరకూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాదియా అక్క షేక్‌.ఆసియా కూడా పవర్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణే.
స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ కామన్‌వెల్త్‌గా…
దక్షిణాఫ్రికా సన్‌సిటీలో ఈ నెల 4 నుండి 13వ తేదీ వరకు జరిగిన కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పోటీల్లో సాదియా 57 కిలోల అండర్‌ జూనియర్‌ విభాగంలో స్క్వాట్‌ -185 కిలోల పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్‌ప్రెస్‌ 95 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌ 180 కిలోలు ఓవరాల్‌గా 460 కిలోలు లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. ప్రపంచం మొత్తం గర్వించేలా అక్కడి పోటీలు నిర్వహించే ప్రతినిధులు ఆమెను ‘కామన్‌వెల్త్‌ స్ట్రాంగ్‌ ఉమెన్‌’గా ప్రకటించారు. అనంతరం ‘స్ట్రాంగ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’ అంటూ పొడగ్తలతో ముంచెత్తారు.
వరల్డ్‌ చాంఫియన్‌గా…
మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు జరిగిన జూనియర్‌ వరల్డ్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిప్‌లో సాదియా 57 కేజీల విభాగంలో ఓవరాల్‌ చాంఫియన్‌గా గోల్డ్‌ మెడల్‌ సాధించారు. స్క్వాట్‌ 190 కేజీలు, బెంచ్‌ ప్రెస్‌ 97.5 కేజీలు, డెడ్‌ లిఫ్ట్‌ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తారు. బంగారు పతకం సాధించటం ద్వారా భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. యుఎఇలోని షార్జాలో 2023 ఆగస్టు 17 నుంచి 21 వరకు జరిగిన ‘ఆసియన్‌ యూనివర్శిటీ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో చాంఫియన్‌షిప్‌లో మొదటిస్థానంలో నిలిచి మొత్తం నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నారు. స్క్వాట్‌ 142.5 కేజీలు, బెంచ్‌ప్రెస్‌ 62.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌ 135 కేజీలు మొత్తంగా 340 కేజీల బరువు ఎత్తి మొదటిస్థానంలో నిలిచారు. ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఆసియన్‌ యూనివర్శిటీస్‌)గా ప్రకటించారు.
పతకాల వర్సం…
కేరళలోని అలప్పుజలో 2023 మే 1 నుంచి 6 వరకూ జరిగిన ‘ఆసియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిప్‌లో మొదటిస్థానంలో నిలిచి ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఆసియా’గా నిలిచారు. న్యూజిలాండ్‌లోని ఆక్‌ల్యాండ్‌లో 2022 నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 4 వరకు జరిగిన ‘కామన్‌ వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిఫ్‌’లోనూ మొదటిస్థానంలో నిలిచి నాలుగు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ కామన్‌వెల్త్‌’గా టైటిల్‌ను గెల్చుకున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2022 ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు జరిగిన ‘వరల్డ్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిప్‌’లోనూ ద్వితీయస్థానంలో నిలిచారు. ఒక గోల్డ్‌, రెండు సిల్వర్‌, రెండు బ్రాంజ్‌ మెడళ్లను అందుకున్నారు. 2022 జూన్‌ 17 నుంచి 21 వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ‘ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిప్‌’లోనూ మొదటి స్థానంలో నిలిచి నాలుగుబంగారు పతకాలను గెల్చుకున్నారు. 2021 టర్కీలోని ఇస్లాంబుల్‌లో జరిగిన ‘ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌’లో మొదటిస్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలను గెల్చుకున్నారు. 2018 మేలో రాజస్థాన్‌లో జరిగిన ‘ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిఫ్‌లోనూ మొదటిస్థానంలో నిలిచారు. స్లావేనియాలో 2023 నవంబర్‌లో జరిగిన ‘వరల్డ్‌ యూనివర్శిటీ క్లాసిక్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌షిప్‌’లోనూ పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు.
దేశ గౌరవాన్ని పెంచుతా
పవర్‌లిఫ్టింగ్‌ చాంఫియన్‌గా నేను ఈ స్థాయిలో రాణించటానికి మొదటగా కోచ్‌గా ఉన్న నా తండ్రి షేక్‌ సందాని ప్రోత్సాహమే కారణం. అలాగే నా కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం ఎంతో ఉంది. పవర్‌లిఫ్టింగ్‌ ఏపీ, గుంటూరు జిల్లా అసోసియేషన్ల సహకారం మరువలేనిది. మంత్రి నారా లోకేష్‌, రోటరీ క్లబ్‌లు కూడా సహకరించాయి. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. జూనియర్‌ వరల్డ్‌లో రెండుసార్లు సత్తా చాటా. సీనియర్‌ వరల్డ్‌లో పతకాలు సాధిస్తా. వరల్డ్‌ గేమ్స్‌లో పతకాలు సాధించటమే నా లక్ష్యం.
– షేక్‌.సాదియా
-యడవల్లి శ్రీనివాసరావు