స్లాట్‌ దొరికితే.. దంచుడే..

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏ చిన్న ప్రెస్‌మీట్‌ పెట్టాలన్నా అధిష్టానం గ్రీన్‌సిగల్‌ ఉండాల్సిందే. సదరు నేత మాట్లాడే అంశానికి ఆమోదముద్ర పడాల్సిందే. ఈ మధ్య బీజేపీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దూకుడు పెంచాడు. ఆర్‌ ట్యాక్స్‌..యూ ట్యాక్స్‌ అంటూ రోజుకో వార్త పట్టుకొచ్చి మీడియాలో చర్చ నీయాంశమవుతున్నాడు. ఓ రోజు ప్రెస్‌మీట్‌ అనంతరం ‘ఏం సార్‌ వరుసగా బాంబులు పేలుస్తున్నారు. నెక్ట్స్‌ మీడియా సమావేశం ఎప్పుడు’ అని రిపోర్టర్లు సరదగా అడగ్గా.. మహేశ్వర్‌రెడ్డి కూడా అంతే జోష్‌లో ‘ఈడ స్లాట్‌ దొరకడమే కష్టంగ ఉందయ్యా. లేకుంటే రోజుకో ప్రెస్‌మీట్‌ పెడతా. రోజుకో బాంబు పేలుస్తా’ అని నవ్వుకుంట అనేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ రెండురోజుల కోసారి మహేశ్వర్‌రెడ్డి ప్రెస్మీట్‌ పెట్టేస్తున్నాడు. మీడియా సమావేశంలో ‘ఏందన్నా వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతు న్నాడు’ అని తోటి రిపోర్టర్‌ను అడిగితే ‘ఏముంది తమ్మీ రోజూ స్లాటు దొరుకుతున్నట్టుంది. అవకాశమొచ్చిందని దంచేస్తున్నడు’ అంటూ నవ్వులు పూయించాడు.
– అచ్చిన ప్రశాంత్‌