– ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
– సుజయెలో కొనసాగుతున్న సైనిక చర్యలు
గాజా : గాజా నగరంలో నీటి పంపిణీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. వీరిలో పిల్లలు కూడా వున్నారు. దాడుల కారణంగా నీటి కాలుష్యం బాగా పెరిగిపోయింది, దీంతో నిర్వాసితులైన పాలస్తీనియన్లు కంటెయినర్లతో నీటిని పట్టుకుంటుండగా, వారిపై కాల్పులు జరిగాయి. శనివారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మొత్తంగా 31మంది పాలస్తీనియన్లు మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గత రాత్రి నివాస భవనాలపై జరిగిన సైనిక దాడుల్లో నలుగురు పిల్లలతో సహా ఆరుగురు మరణించగా, మరో 15మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని మఘాజి శరణార్థ శిబిరంపై కూడా దాడి జరిగిందని, అనేకమంది మరణించారని పాలస్తీనా వార్తా సంస్థ వాఫా తెలిపింది. బురెజి శరణార్థ శిబిరంపై కూడా ఇజ్రాయిల్ బలగాలు దాడులు జరిపాయి. నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో అనేకమంది మరణించారని మీడియా వార్తలు తెలిపాయి. సాబ్రా ప్రాంతంలో ఇంటిపై, కారుపై జరిగిన దాడిలో నలుగురు మరణించగా, 8మంది గాయపడ్డారు. గత 9మాసాలుగా జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 37,834మంది మరణించగా, 86,858మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలో మున్సిపల్పార్క్పై బాంబు దాడి జరగడంతో మరో ఐదుగురు పాలస్తీనియన్లు మరణించారు.
ఇదిలావుండగా, సుజయె ప్రాంతంలో సైనిక చర్యలు చేపడతామని, ప్రమాదకరమైన యుద్ధ జోన్‌గా మారుతుందని హెచ్చరిస్తూ ప్రజలను ఖాళీ చేయాలని సైన్యం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 60వేల మంది ప్రజలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. దక్షిణ గాజాలోని అల్ మవాసి ఏరియాలో సైనిక చర్యల ఫలితంగా 5వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. అనేకమంది మరణించారు. సుజయోలో సైనిక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ ప్రకటించింది. మొత్తంగా వాయు, భూతల దాడులు ఒకేసారి కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. స్కూలు ఆవరణలో ఆయుధాల నిల్వ కేంద్రాన్ని తాము కనుగొన్నామని సైన్యం ప్రకటించింది. తమకందిన నిఘా సమాచారం ప్రాతిపదికగా భూతలదాడులు సాగుతున్నాయని తెలిపారు. గత 24గంటల్లో 40మంది పాలస్తీనియన్లు చనిపోయారని వైద్య వర్గాలు తెలిపాయి.