– ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలతో బేరసారాలు
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
– మమ్మల్ని ఓడించే సత్తా లేకనే తెరచాటు ప్రయత్నాలు
న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయిస్తే ఆమ్‌ఆద్మీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలకు పాతిక కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ప్రలోభపెట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు నడిపిందని, మద్యం పాలసీ కుంభకోణంలో తనను అరెస్ట్ చేస్తానని కూడా బెదిరించిందని ఆయన చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు జరిపిన సంభాషణలను రికార్డు చేశామని ఆప్ తెలిపింది. ‘ఇటీవల ఢిల్లీకి చెందిన ఏడుగురు ఆప్ శాసనసభ్యులను బీజేపీ సంప్రదించింది. కొద్ది రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటామని చెప్పింది. 21 మంది శాసనసభ్యులతో చర్చలు జరిపామని, మిగిలిన వారిని కూడా సంప్రదిస్తున్నామని తెలిపింది. ఆ పని పూర్తయిన తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నారు. మీరు కూడా రావచ్చని మా ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇచ్చారు. పార్టీ మారితే పాతిక కోట్లు ఇస్తామని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు టిక్కెట్లు కూడా ఇస్తామని ఆశ పెట్టారు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేజ్రీవాల్ శనివారం పోస్ట్ చేశారు.
ఇప్పటి వరకూ 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించామని బీజేపీ చెబుతున్నప్పటికీ ఏడుగురితో మాత్రమే చర్చించిందని తమ వద్ద సమాచారం ఉన్నదని కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ను వీరందరూ తిరస్కరించారని చెప్పారు. ఎన్నికల్లో ఆప్‌ను ఓడించే సత్తా లేకపోవడంతో దొడ్డిదారిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘దీనర్థం ఏమిటంటే మద్యం కుంభకోణంపై విచారణ కోసం నన్ను అరెస్ట్ చేయడం లేదు. కానీ వారు ఢిల్లీలోని అమ్‌ఆద్మీ పార్టీని కూలదోసేందుకు కుట్ర చేస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో వారు మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనేక కుట్రలు పన్నారు. అయితే వారు విజయం సాధించలేకపోయారు. దేవుడు, ప్రజలు మాకు ఎల్లవేళలా మద్దతు ఇస్తూనే ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరూ కలసికట్టుగా ఉన్నారు. ఈ సారి కూడా వారు తమ నీచమైన ప్రయత్నాల్లో విఫలమవుతారు’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ ప్రజల కోసం తమ ప్రభుత్వం ఎన్ని పనులు చేసిందో బీజేపీకి తెలుసునని, వారు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని ఎదుర్కొని నిలబడ్డామని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను అపారంగా ప్రేమిస్తారని, కాబట్టి ఎన్నికల్లో ఆప్‌ను ఓడించే సత్తా వారికి లేదని తెలిపారు. అందుకే మద్యం కుంభకోణం పేరు చెప్పి తనను అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తున్నారని విమర్శించారు. రాజధానిలో రాజకీయ అశాంతిని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి అతిష్ ఆరోపించారు. ‘కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తామని, 21 మంది ఎమ్మెల్యేలను లోబరచుకుంటామని, ప్రభుత్వాన్ని కూలదోస్తామని వీడియో టేపులో వారు చెప్పారు. తమకు ఇవ్వజూపిన సొమ్మును ఆప్ ఎమ్మెల్యేలందరూ తిరస్కరించారు. ప్రభుత్వాలను పడగొట్టడం బీజేపీకి అలవాటే. మధ్యప్రదేశ్, కర్నాటక, అరుణాచల్‌లో వారు చేసింది అదే పని’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గెలవలేని చోట ప్రజా ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటుందని ఎద్దేవా చేశారు.