అసమానత్వం వ్యవస్థల్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, మనుషుల మనస్తత్వంలో ఉన్నా – దాన్ని సవాల్ చేసే పేరు – అంబేద్కర్!
”అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ – ఈ మధ్య అంబేద్కర్ పేరు జపించడం ఫ్యాషన్ అయిపోయింది. అన్నిసార్లు భగవంతుడి పేరు గనక తలుచుకుంటూ ఉంటే, రాబోయే ఏడేడు జన్మల్లో స్వర్గం ప్రాప్తించేది!” అని పార్లమెంటు సాక్షిగా అన్నాడు ఈ దేశ గహమంత్రి అమిత్ షా. అంబేద్కర్‌ను అవమానిస్తూ మాట్లాడినందుకు డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి యం.కె. స్టాలిన్ ఇలా స్పందించారు – ”పాపాలు చేసినవాళ్లే పుణ్యం కోసం అంగలారుస్తారు. దేశం, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తపించే వాళ్ళు అంబేద్కర్ పేరునే తలుస్తూ ఉంటారు? అని.
”గౌరవంగా జీవించడంలో నాకు నమ్మకముంటే- నిన్ను నువ్వు సంస్కరించుకోవడం ఉత్తమం. మానవ జీవిత అంతిమ లక్ష్యం దేవుడో, స్వర్గమో కాదు. అసమానతల నుండి స్వేచ్ఛ- దాని కోసం చేసే పోరాటం గొప్పది” అన్నారు డా.బి.ఆర్.అంబేద్కర్. అంబ్కేదర్ చెప్పిన ఈ విషయం ఎలా ఉంది? దేశ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా ఎదగని తనం ఎలా ఉంది? ఆలోచించాల్సిన విషయం. దానివల్ల అంబేద్కర్ విలువ తగ్గలేదు. అమిత్ షా వెకిలితనం బయటపడింది. ”స్వర్గం, నరకం ఎక్కడో లేవు. ఈ భూమి మీదే ఉన్నాయి. ప్రపంచాన్ని మెరుగైందిగా తీర్చిదిద్దుకోవడంలో ముఖ్యపాత్ర మానవాళిదే!”- అని అన్నారు షహీద్ భగత్ సింగ్. ఇదే విషయం గూర్చి పరిశోధకుడు, చరిత్రకారుడు అయిన యువల్ నోవా హరారి ఏమన్నారో చూడండి – ”చచ్చిన తర్వాత స్వర్గంలో నీకు బోలెడు అరటిపండ్లు ఇస్తాగా – ఇప్పుడైతే నీ చేతిలోని అరటిపండు నాకు ఇచ్చేయవా?- అని మీరు కోతిని అడిగిచూడండి… అది ఏ మాత్రమూ వినిపించుకోదు. తన చేతిలోని అరటి పండును మీకు ఇవ్వదంటే ఇవ్వదు.” కోతికన్నా పరిణతి చెందిన మెదడు ఉన్నవాడు మనిషి కదా? మరి కోతికి ఉన్న వివేకం కూడా ఇతనికి ఎందుకు ఉండడం లేదూ? అని మనలాంటి వారికి అనుమానం వస్తుంది. స్వర్గం, నరకం, దైవం లాంటి వాటిని ఎందుకు నమ్ముతున్నాడూ? ఇక్కడ, పార్లమెంటులో స్వర్గం గురించి మాట్లాడిన అమితా షా గురించి మాత్రమే కాదు. అలాంటి భావజాలంతో బతుకుతున్న ప్రజలందరి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆవు మూత్రం, ఆవు పేడ గురించి ప్రచారం చేస్తున్న ఆరెస్సెస్, బీజేపీ వారు ఒక విషయం ఆలోచించుకోవాలి. అప్పుడే పుట్టిన ఆవు దూడ సైతం తల్లి వెనక్కి వెళ్ళి, మూత్రం తాగదు. పొదుగు దగ్గరికి వెళ్ళి పాలే తాగుతుంది. అంటే – ఆవు దూడకు ఉన్న పరిజ్ఞానం కూడా అధికార పార్టీ సభ్యులకు లేదా ?
”స్వర్గం అంటే నియంతత్వాధికారమే. అక్కడ నువ్వు దాన్ని పొగుడుతూ ఉండాల్సిందే గాని, దానికి వ్యతిరేకంగా నీ ఇష్టం వచ్చినట్టుగా, స్వేచ్ఛగా ఆలోచించడానికి వీలే లేదు. అది నిషిద్ధం -” అని అన్నాడు క్రిస్టోఫర్ హిచ్సెన్స్ – బ్రిటిష్ అమెరికన్ రచయిత, జర్నలిస్ట్. బహుశా అమిత్ షాకు హిచ్చెన్స్ పేరు తెలిసి ఉండదు. అంత చదువే గనక చదివి ఉంటే, పార్లమెంటులో స్వర్ణం ప్రసక్తి తెచ్చేవాడు కాదు. పార్లమెంటు నిండు సభలో అమితా షా రాజ్యాంగ నిర్మాతను అవహేళన చేయడం ఈ దేశ ప్రజలకు నచ్చలేదు. ప్రతిపక్షాలకూ నచ్చలేదు. అందుకే పార్లమెంటు ఆవరణలోనే నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. మన రాజ్యాంగం స్థానంలో మనుస్మతిని ప్రవేశపెట్టాలనుకున్న ఆరెస్సెస్ – బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తగినంత మెజారిటీ రాకపోవడం పై ఆసహనంగా ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్న తమ కల నేరవేరడం లేదన్న అక్కసుతో ఉంది. అమిత్ షా వెకిలి మాటల్లో అదే బహిర్గతమైంది. దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న కోరిక వీలుకావడం లేదేనన్న కోపాన్ని హౌం మంత్రి, అంబేద్కర్‌పై వెళ్ళగక్కుకున్నట్టుగా ఉంది. అసలు ఆయన తన నేపథ్యం గురించి ఆలోచించుకుంటే బావుండును కదా? జస్టిస్ లోయాను హత్య చేయించిన వాడు ఈ దేశానికి హాం మంత్రి కావడమే విడ్డూరం. దేశ పౌరుల్లో గడ్డ కట్టుకుని ఉన్న తెలివి తక్కువతనానికీ, మూర్ఖుత్వానికీ ఈ దేశ హౌం మంత్రి ప్రాతినిధ్యం వహి స్తున్నాడా? అంటే- అలాగే అనిపిస్తోంది మరి !
దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా, నాటి బ్రిటీష్ పాలకుల అడుగులకు మడుగులొత్తిన నాటి హిందూ మహాసభ, జన సంఫ్‌ు, నేటి ఆరెస్సెస్ బీజేపీ ప్రముఖులు ఏమేం చేస్తూ వచ్చారో మనకు తెలియనిదా? ఏనాడూ మన జాతీయ జెండాను గౌరవించలేదు. ఇప్పటికీ గాంధీ బొమ్మ మీద ఎర్ర రంగు జల్లి పిస్టల్ పేలుస్తుంటారు. నెహ్రూకు సంబంధం లేని అవాస్తవాలన్నీ ఏకరువు పెడుతూ, ఆయన కారణంగానే దేశం ప్రతిష్ట దిగజారిందని దుష్ప్రచారం చేస్తుంటారు. సుభాష్ చంద్రబోస్ చెప్పని మాటలన్నీ చెప్పినట్టుగా టముకు వేసుకుంటూ తిరుగుతారు. నెహ్రూ – సుభాష్‌ల మధ్య వైరం ఉండేదన్నట్టు అబద్దాలు చెపుతారు. వాళ్ళిద్దరు ఎంత మంచి స్నేహితులంటే – కలకత్తాలో సుభాష్ చంద్రబోస్ ఇల్లు చెక్కు చెదరకుండా ఉంది. అందులో ఇప్పటికీ ఒక గది నెహ్రూజీకి కేటాయించబడి ఉంది – ఆ రోజుల్లో నెహ్రూ గనక బెంగాల్ పర్యాటన్‌లో ఉంటే, సుభాష్ చంద్రబోస్ భవనంలో తనకు కేటాయించిన ‘నెహ్రూ జీస్ రూమ్’లో విశ్రమించే వారు. ఎంత గాఢమైన మైత్రి ఉంటేనో… సుభాష్ చంద్రబోస్ తన భావనంలో ఆ ఏర్పాటు చేసి ఉండి ఉంటారు కదా? తమ మెదళ్ళలో ఆవు పేడ నింపుకున్న వారికి ఇలాంటి స్నేహాలు, గౌరవాలు అర్ధం కావు.
గుజరాత్ వాడైనందుకు సర్దార్ పటేల్‌ను సొంతం చేసుకోజూస్తారు. సర్దార్ పటేల్ హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్‌ను నిషేధించిన విషయం పొరపాటున కూడా చెప్పుకోరు. ప్రపంచవ్యాప్తంగా బీఫ్ ఎగుమతి చేసే వ్యాపారులంతా బీజేపీ వారేనన్నది చెప్పుకోరు. ఎవడో ఒక పేద ముస్లిం ఇంట్లో బీఫ్ దొరికిందని అతణ్ణి కొట్టి చంపుతారు. ఆ పార్టీ ప్రముఖులు ముస్లింలను అల్లుళ్లుగా చేసుకుంటారు. ‘లౌ జిహాద్’ పేరుతో సామాన్యుల్ని కొట్టి చంపుతారు. తమ వారసుల్ని విదేశాల్లో ఉన్నత విద్య చదివిస్తారు. చదువు అబ్బకపోయినా ఉన్నత పదవుల్లో కూర్చోబెడతారు. ఈ దేశంలోని సామాన్యులు మాత్రం ‘జై శ్రీ రామ్’ అంటూ రోడ్లెక్కాలనీ, ఆరెస్సెస్ జెండాలు పట్టుకుని తిరగాలని ఉద్భోదిస్తారు. ముస్లింలను ద్వేషించాలని హిందువులను రెచ్చగొడతారు. ఏ అనుభవం ఉందని, క్రికెట్ గురించి అతనికేం తెలుసునని అమిత్ షా తన కొడుకు జై షాకు క్రికెట్ బోర్డును అప్పగించాడూ? అడిగేవాడు లేకనే కదా?
15 ఆగస్టు 1947లో తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ఉన్న మత కట్టడాలలో, ప్రార్థనా స్థలాలలో మార్పులు, చేర్పులు చేయరాదన్న నియమం ఉంది. దాన్ని ప్రభుత్వంలో ఉన్న వారే పాటించరు. ఏళ్ళ కేళ్ళుగా కోర్టులలో, మత కేంద్రాలకు సంబంధించిన కేసులూ, సర్వేలూ అవసరమా? అవేమైనా దేశ ప్రగతికి ఉపయోగపడేవా? ఇదేనా సబ్ క సాత్ – సబ్ క వికాస్? ఏదీ సబ్ క విశ్వాస్? వీళ్ళకు అసలు మెదళ్ళు పని చేస్తున్నాయా? పని చేయాలంటే అవి ఉండాలి కదా? ప్రతిసారి ప్రతి చోటా కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ఈ ‘మాన్యవరులు’ బుద్ధి తెచ్చుకోరా ? ఇంగ్లీషు కవి పి.బి.షెల్లీ అంటాడు. ”మతం అనేది మానవుడి గడ్డకట్టిన ఆలోచన. దాని నుండే ప్రార్థనా మందిరాలు పుట్టుకొచ్చా యి. మనుషులు భయంతో విధేయులుగా లొంగి ఉండడానికి అత్యాశతో రూపొందించిందే స్వర్గం – అంత కన్నా మరేమీ కాదు.” – మరి పార్లమెంటులో మాన్య గహమంత్రి ఏ స్వర్గం గురించి చెప్పారూ? షెల్లీని చదివే నేపథ్యం మాత్రం ఆయనకు ఉన్నట్లు లేదు. ఇదే విషయం మీద జర్మన్ తత్త్వవేత్త ఫెడరిక్ నీషే అంటాడు. ”మీకు ఎవరైనా స్వర్గం ఆశ చూపుతున్నారంటే వాళ్ళు నీ కాళ్ళకింది భూమిని కాజేయడానికి సిద్ధంగా ఉన్న ప్రమాదకరమైన మనుషులని అర్థం!” – అని అన్నాడు. అంటే ఫెడరిక్ నీషే ప్రకారం ఈ దేశ గహమంత్రి అంత ప్రమాదకరమైన వాడా? కాకపోతే పార్ల మెంటులో అంబేద్కర్‌ను ఎద్దేవా చేస్తూ స్వర్గం గురించి ఎందుకు ప్రచారం చేశాడు? మనలాంటి సామాన్యులకు అనుమానం వస్తుంది కదా?
గుజరాత్ మారణ హోమానికి ప్రధాని జవాబు చెప్పడు. మణిపూర్ మారణ హామానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు. అసలు మణిపూర్ ఈ దేశంలోని భాగం కాదన్నట్టుగా వ్యవహరిస్తారు. అక్కడ మహిళల్ని నగంగా ఊరేగించనిస్తారు. వందల మంది ప్రాణ త్యాగం చేసినా, పంజాబ్ రైతుల్ని ఢిల్లీ సరిహద్దుల్లో ఆపేసి, వారి మీద గుండ్ల వర్షం కురిపిస్తూనే ఉంటారు. ఏదో రకంగా ప్రజల్ని భయకంపితులను చేసి, అక్రమంగా అధికారంలో కొనసాగాలన్న తాపత్రయం తప్ప ఈవీయంల విషయంలో పారదర్శకత ఏదీ? ప్రజల అవసరాల గూర్చి ఆలోచించిందెక్కడీ మీడియాను కొనేసుకున్నా తమ కుట్రలు, కుతంత్రాలు దేశ ప్రజలకు ఎలా తెలుస్తున్నాయని అధికారంలో ఉన్న వారు కుతకుతమని ఉడికిపోతున్నారు. అంబేద్కర్ పై అమితా షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజరు దళపతి ఇలా అన్నారు. ”దేశంలో స్వాతంత్య్ర స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడు ఆరాధించే వ్యక్తి బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్! ఆయన పేరు పలకడానికి గుండె, పెదాలూ ఉవ్విళ్ళూరుతుంటాయి. అలాంటి అంబేద్కర్‌ను అగౌరవ పరచడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అమితాషాకు, ఆయన పార్టీ వారికీ ఇష్టం ఉన్నా లేకున్నా ఈ దేశ ప్రజల్లో అత్యధికులు అంబేద్కర్ పేరును స్మరిస్తూనే ఉంటారు” అని !
అంబేద్కర్‌ను కాంగ్రెస్ వారే గౌరవించలేదని అమిత్ షా అండ్ పార్టీ ఎంత గొంతు చించుకున్నా అదంతా వధా! వీళ్ళు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకుండా, తప్పించుకు తిరిగిన కుహనా దేశ భక్తులని ఈ దేశ ప్రజలకు తెలుసు. పండిట్ నెహ్రూ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు డా. బి.ఆర్. అంబేద్కర్ ఆయన మంత్రి వర్గంలో సహచరుడు. ఈ దేశానికి తొలి న్యాయ శాఖా మంత్రి కొద్దిపాటి విధానపరమైన విభేదాలు వారి మధ్య ఉంటే ఉండొచ్చుగాక – అవి వారిని దూరం చేయలేదు. దేశ ప్రగతికి ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పటి ఆరెస్సెస్‌కు ఆనాటి రూపం హిందూ మహాసభ. ఇప్పటి బీజేపీకి ఆనాటి రూపం జనసంఫ్‌ు. నాటి హిందూ మహాసభ, జనసంఫ్‌ులు కలిసి కాంగ్రెస్‌పై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చిన విషయం ఈ కుహనా దేశభక్తులు ఇప్పటి తరానికి తెలియనివ్వరు. వారి ఒత్తిడి తట్టుకోలేక నాటి కాంగ్రెస్ నాయకులు ఆనాడు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు తప్ప – వీరిలాగా ఎన్నడూ డా. బి. ఆర్. అంబేద్కర్‌ను పార్లమెంటులో గానీ, బయట గానీ అవహేళన చేయలేదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి! దేవుళ్ళను తలుచుకుంటే స్వర్గం లభిస్తుందని” అమిత్ షాకు ఎలా తెలుసూ? ఆయనకు ఆ విషయంలో ఏమైనా అనుభవముందా? ఉంటే బయట పెట్టాలి. అనుభవం లేకపోతే మరి అంత గట్టిగా ఎలా చెప్పగలిగాడూ? అసలు విషయం అది కాదు, ఆ వంకతో అంబేద్కర్‌ను హేళన చేయడం ఆయన ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది! అమిత్‌షా రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త, (మెల్బోర్న్)నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు