డబ్బులిస్తే తీస్కోండి..

– ఓటు మాత్రం కారుకే వేయండి… : మంత్రి కేటీఆర్‌
– రజాకార్‌ సినిమాతో చిచ్చుకు బీజేపీ యత్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌ నేతలు డబ్బులిస్తే తీస్కోండి..ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి…’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్‌ నేతలు ఓటర్లను కొనాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిం చిందని గుర్తు చేశారు. అయితే కేంద్రంలోని బీజేపీకి ఇది నచ్చటం లేదని విమర్శించారు. తొమ్మిదన్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ భ్రమల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని అన్నారు. రజాకార్‌ సినిమాతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళ స్టోరీ అంటూ రకరకాల సినిమాల ద్వారా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టటం ద్వారా బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.