కొందరు మనుషులు ‘ఇటెటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు’ ఇసొంటోల్లను ‘పాపమంటే దోషం అయితది’. మనుషుల సంగతి రాను రాను ఇట్లా తయారయితంది ఏం చేస్తాం. అసలు వీళ్లు ‘వేలు పెట్ట సందిస్తే కాలు పెట్ట చూస్తరు’ ఏదో మనవాళ్లే అని మంచిగా మాట్లాడి ఏదైనా సహాయం చేస్తిమా అసలుకే ఎసరు పెడతరు.
లోకం తీరు మారింది. కొందరైతే అమాయక చక్రవర్తుల్లా కనిపిస్తరు కాని, కాదు వీళ్లను ‘వేలు పెడితే కొరకరు, వెన్న పెడితే నాకరు’ అంటారు. వెన్నను నోటి కాడ పెడితే రుచి చూడని వాళ్ళు ఉంటారా. కానీ అట్లా నటిస్తారనే సందర్భంలో ఈ సామెత వాడతారు. అయినా వాళ్లకు ఏమీ కాదు. ఎవలు వీళ్ళ మనసు ఎరుక పట్టరు. ‘వెంటికలు ఉన్న అమ్మ కొప్పు ఎటు పెట్టినా సక్కదనమే’ నట. ఇట్లా చాలా వేషాలు వేస్తుంటారు. ఎన్ని వేషాలు వేసినా కాలగమనములు నిజాలు తెలుస్తాయి’ అందుకే
‘వేషాల పోశాలు దేశాల పాలు’ అన్నారు.
– అన్నవరం దేవేందర్, 9440763479