– అన్ని గ్రామాల్లో వీధి కుక్కల బెడద
– భయం భయంగా వణుకుతున్న ప్రజలు
– అధికారులు స్పందించి తరలించాలని గ్రామస్తుల డిమాండ్
నవతెలంగాణ-పెద్దేముల్
మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కనిపించిన వారిని కదిలించిన వారిని హడలెత్తిస్తూ దాడి చేస్తున్నాయి. పలు వీధుల్లో ఇటీవల వీధి కుక్కలు బెడద శతిమించి పోతోంది. వీధులు, రహదారులపై గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. విధుల గుండా నడుచుకుంటూ పోయే వ్యక్తులకు, వాహనదారుల వెంటపడి భయపడుతున్నాయి. వారం రోజుల నుంచి ఒక కుక్కకు రేబిస్ సోకి సుమారు అది పదిమందికి కరిచింది. నిత్యం ఏదో ఒకచోట బాధితులు కుక్కల భారిన పడి ఆస్పత్రులకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మండల కేంద్రంలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, బస్టాండ్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న పంచాయతీ, వెటర్నరీ సిబ్బంది చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బుద్ధారం, గాజీపూర్ గ్రామాలలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వ్యక్తులపై వెంబడించడంతో కిందపడి ఆస్పత్రి పాలయ్యారు. అధికారులు స్పందించి గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్న కుక్కలను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
చిన్నపిల్లలను బయటకు పంపాలంటే భయపడుతున్నాం
మా బీసీ కాలనీలో రోజు రోజుకు కుక్కల బెడద ఎక్కువవుతుంది. కుక్కలను నియంత్రించే చర్యలు సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. రోడ్లపై వెళ్లే వారి వెంట పడుతు న్నాయి. వాహనదారులను వెంబడి స్తున్నాయి. చిన్నపిల్లలను బయటకు పంపాలి అంటేనే భయపడుతున్నాం. గ్రామాల్లో కుక్కలు లేకుండా చూడాలి.
కమ్మరి అమల బాధితురాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ ఆదేశాల మేరకు వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ త్వరలో చేస్తాం. అన్ని వీధి కుక్కలకు రేబిస్ టీకాలు వేస్తాం. చిన్నపిల్లలను బయటకు పంపించినప్పుడు పిల్లల పట్ల తల్లిదం డ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుకుని పరిస్థితుల్లో కుక్కలు కరిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నాటు వైద్యం చేసుకోవద్దు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వెంకట్ రాజు పశు వైద్య శాఖ వైద్యుడు