అడుగేయటం మొదలెడితే…

If you start asking...ఆమె పేరు పూనమ్‌ సింగ్‌. ఢిల్లీ వాసి. తను కలలుగన్న ప్రపంచం వేరు. డాక్టర్‌ చదవాలనుకుంది. సమాజానికి తనకు చేతనైన సాయం చేయాలనుకుంది. తనేమిటో నిరూపించుకోవాలనుకుంది. కానీ తను అనుకున్నదేదీ జరగలేదు. చదువు పూర్తి కాకముందే 19 ఏండ్లకే వివాహం చేశారు పెద్దలు. చిన్న వయసులోనే పెండ్లి కావటం.. ఆ తర్వాత పిల్లలు సంసారం.. రోజువారీ జీవితం ఇంటి చుట్టూ ముడిపడి పోవటంతో ఆమె కలలు నెరవేరలేదు. ఏదో నిరాశ ఆమెను వెంటాడేది. అలాంటి ఆమె వ్యాపార విజయ గాథ ఇప్పుడు మీ కోసం…
పూనమ్‌కు ఇద్దరు పిల్లలు. వారి చుట్టే జీవితం. పిల్లలు స్కూలుకు వెళ్ళటం ప్రారంభించాక.. కొంత సమయం దొరికింది. అంతే తనూ విద్యాభ్యాసం ప్రారంభించింది. ప్రయివేటుగా డిగ్రీ పూర్తిచేసింది. ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ కూడా పొందింది. అయితే, ఆమె ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించలేకపోయింది. ఇంటి పనులు, తన కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీ అయిపోయింది. పూనమ్‌ సింగ్‌కు స్నేహితులు కూడా పెద్దగా లేరు. 2018లో పిల్లలిద్దరూ హాస్టల్‌కు వెళ్ళారు. ఇక ఖాళీ సమయం దొరకటంతో తనదంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. ‘ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా జీవిత ఉద్దేశ్యం ఏమిటో బోధపడలేదు. చాలా నిరుత్సాహానికి గురయ్యాను. స్పష్టమైన జీవిత లక్ష్యమేదీ లేదు.. ఓ సమయంలో డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళాను… ఓ చిన్న ఆలోచన నా జీవితాన్ని మార్చింది’ అంటుంది పూనమ్‌.
షాక్‌కు గురిచేసిన ఘటన
ఒంటరిగా, మానసికంగా కుంగిపోతున్న పూనమ్‌కు ఆమె తల్లి మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్లమని చెప్పింది. సమీపంలోని ఆలయానికి కొన్ని పూలను తీసుకొని వెళ్లింది పూనమ్‌. దేవతకు సమర్పించేందుకు ఆ పూలను పూజారికి ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఆమెను షాక్‌కి గురి చేసింది. దేవుడి పాదాల దగ్గర కూడా ఉంచకుండా పూలను పక్కనే ఉన్న చెత్త కుండీలో పడేశారు. అక్కడే కాసేపు కూర్చుని మొత్తం గమనించింది. పువ్వులన్నిటిదీ అదే దారి. చెత్తకుండీలో పడేస్తున్నారు. కొన్ని గంటలకు చెత్త కుండీ కాస్తా… పూల కుండీగా మారింది. ఇంటికి తిరిగి వచ్చిన పూనమ్‌… దేవాలయాల్లోని పూల వ్యర్థాలతో ఏం జరుగుతుందోనని ఇంటర్‌నెట్‌లో పరిశోధించింది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ అప్లయిడ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ నివేదిక ప్రకారం, ప్రతి ఏడాదీ సుమారు 80 లక్షల టన్నుల పువ్వులు మన దేశ నదుల్లో డంప్‌ అవుతున్నాయి. నది కాలుష్య కారకాల్లో పూల వ్యర్థాల శాతం 16 అని తెలుసుకుంది. పూల వ్యర్థాలను ఉపయోగించుకునే మార్గాల కోసం వెతకటం ప్రారంభించింది పూనమ్‌.
అన్ని అడ్డంకులనూ అధిగమించి..
ఆమె తన ఇంటి దగ్గర ఆవు పేడ పొడిని అగరబత్తుల తయారీకి ఉపయోగించే ఒక చిన్న వ్యాపారాన్ని చూసింది. పువ్వులతో కూడా అలా చేయవచ్చా.. అన్న ఆలోచన ఆమెలో మొదలైంది. ‘రోజూ టన్నుల కొద్దీ పూలను నదుల్లో పోయటం నేను గుర్తించాను. పూలను రీసైక్లింగ్‌ చేస్తున్న ఓ కంపెనీకి వెళ్ళి అక్కడ అధ్యయనం చేశాను. వారి సహాయం అడిగాను… వారి గైడెన్స్‌తో పని మొదలుపెట్టాను’ అని పూనమ్‌ చెప్పింది. ఉదయం అయిదు గంటలకే నిద్రలేచి.. తన నివాసానికి సమీపంలోని దేవాలయాలకు వెళ్తుంది. అక్కడ సిబ్బందిని అడిగి వృథాగా పడేసిన పువ్వులను తెస్తుంది. అప్పటికి దాదాపు ఉదయం తొమ్మిదవుతుంది. తను తెచ్చిన వ్యర్థాలన్నిటినీ వేరు చేసి ఎండలో ఆరబెడుతుంది. ఈ ఎండిన పూలతో ప్రయోగాలు చేయొచ్చన్న ఆశ.. లక్ష్యమే అన్ని అడ్డంకులనూ అధిగమించగలిగింది. మొదట్లో పూలన్నీ పాడయిపోయేవి. అయినా పట్టు వదల్లేదు. ప్రయత్నం ఆపలేదు.
వెంచర్‌ ఇలా..
2019 జూన్‌లో.. తన స్నేహితురాలు పింకీ యాదవ్‌తో కలిసి ‘ఆరుహి ఎంటర్‌ ప్రైజెస్‌’ను ప్రారంభించింది. తన సోదరుడు అందించిన కొద్దిపాటి స్థలంలో పూనమ్‌ ఆ యూనిట్‌ను ఏర్పాటుచేసింది. అప్పుడు ఆమె వయసు 37 ఏండ్లు. ఆమె ఈ రోజు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 15 ఆలయాల నుంచి ప్రతీ మూడు రోజులకు దాదాపు 100 కిలోలకుపైగా పూల వ్యర్థాలను సేకరిస్తుంది. ఆమె వెంచర్‌లో ప్రతి నెలా 1,000 కిలోలు పూలు రీసైకిల్‌ చేస్తుంది. వాటితో అగరబత్తులు, దూప్‌ బత్తీలు, దియాలతో పాటు, ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌లనూ తయారుచేస్తుంది. ఆమె ఉత్పత్తుల రేటు రూ.50-350 వరకు ఉంటాయి. నెలవారీ ఆదాయం రూ.2 లక్షలుపైనే. ఆమె ధూప్‌ స్టాండ్‌, ప్యాకేజీలు కూడా వ్యర్థాలతోనే తయారు చేస్తుంది. తన యూనిట్‌లో అయిదుగురు మహిళలను నియమించు కుంది. వారిని ఆమె ‘ఫ్లవర్‌ రీసైక్లర్స్‌’ అని పిలుస్తుంది. మొదట్లో తన పొదుపు మొత్తాన్ని వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన పూనమ్‌ తన వెంచర్‌ కోసం కొంత రుణాన్నీ తీసుకుంది. తన ఉత్పత్తులు సేంద్రీయమైనవని, దాదాపు 80శాతం పూల వ్యర్థాలతో తయారు చేసినవేనని పూనమ్‌ చెబుతుంది.
ఎగ్జిబిషన్‌లలో విక్రయం
తయారుచేయటమైతే ప్రారంభించింది. వాటి విక్రయాలు ఎలా? ఢిల్లీ హాట్‌ (దక్షిణ ఢిల్లీలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రాల్లో ఒకటి), ఇతర ప్రదర్శనల్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ‘ఢిల్లీ హాట్‌లో నేను ఏర్పాటు చేసిన మొదటి స్టాల్‌కు మంచి స్పందన వచ్చింది. ఉపాధ్యాయులు కొందరు వస్తువులను చూసి ఫ్యాక్టరీని చూడటానికి వచ్చారు. వీటి గురించి తమ విద్యార్థులతో మాట్లాడాలని నన్ను ఆహ్వానించారు’ అని పూనమ్‌ చెప్పింది. వ్యాపారం పుంజుకుంటున్న సమయంలోనే కోవిడ్‌ మహమ్మారి ప్రభావం పూనమ్‌ బిజినెస్‌పైనా పడింది. అప్పుడు కూడా తన వస్తువుల అమ్మకాలపై దృష్టి పెట్టింది. వెబ్‌సైట్‌, వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ ద్వారా ప్రచారం చేసుకుంది. ఆన్‌లైన్‌లో తన ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది.
మూడు వేల మందికి శిక్షణ
పూనమ్‌ ఇప్పుడు ఖాదీ ఇండియా, నేషనల్‌ కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాలో మాస్టర్‌ ట్రైనర్‌. జమ్మూలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమంతోపాటు అనేక ప్రభుత్వ సంస్థల్లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఆమె 3,000 మందికిపైగా మహిళలకు శిక్షణనిచ్చింది. ముఖ్యంగా పర్యావరణానికి సహాయం చేస్తూనే.. వారి స్వయం సమృద్ధికి ఓ మార్గాన్ని చూపుతున్నది.
పర్యావరణానికి తన వంతు సాయం
ఈ వ్యాపారం పూనమ్‌కు మంచి గుర్తింపుతోపాటు.. వేల మంది మహిళల జీవితాల్లోనూ మార్పుతెచ్చింది. మరోవైపు పర్యావరణానికీ తన వంతు సాయం చేస్తున్నది. ఏ ఒక్క ఆలయంలోనూ పూలను చెత్తలో వేయని దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలన్నది ఆమె కల. ‘మన కోసం ఓ మార్గాన్ని రూపొందించు కోవడానికి మనందరికీ జీవితంలో ఓ అవకాశం లభిస్తుంది. దానిని మిస్‌ చేసుకోకూడదు. మీ కోసం జీవించండి, మీకు సంతోషాన్నిచ్చేది చేయండి… మొదటి అడుగు ఎప్పుడూ కష్టమే… కానీ మీరు అడుగువేయటం మొదలుపెడితే.. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు..’ అంటుంది పూనమ్‌.
– కె లలిత