మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం

మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం– బీజేపీతో టచ్‌లో ఐదుగురు మంత్రులు
– సీఎం కుర్చీపై పదిమంది మినిష్టర్ల కన్ను
– భయంతోనే రేవంత్‌రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నారు
– కోమటిరెడ్డి దమ్ముంటే భువనగిరి అభ్యర్థిని గెలిపించుకో : బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హాట్‌హాట్‌ కామెంట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారనీ, తమ పార్టీలోని ఒక్క ఎమ్మెల్యేని టచ్‌చేసినా 48 గంటల్లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. షిండేలుగా మారేందుకు కోమటిరెడ్డిలాంటోళ్లు ఐదుగురు మంత్రులు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన బాంబు పేల్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, రామారావు, రామిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మంత్రి తనను సీఎం పదవి నుంచి దించుతాడోనన్న భయం రేవంత్‌రెడ్డిని వెన్నాడుతున్నదనీ, ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతుంటే సీఎం సీటుపై పది మంది మంత్రులు కన్నేశారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాదు.. అసలు మీ తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మీతో టచ్‌లో ఉన్నాడో లేడో చూసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సూచించారు. రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మికి అధిష్టానం భువనగిరి టికెట్‌ ఇస్తానంటే అడ్డుకున్నది మీరేనన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాలని వెంకట్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. వెంకట్‌రెడ్డీ మీరు గడ్కరీనీ, అమిత్‌షాను కలిసొచ్చింది వాస్తవం కాదా? తెలంగాణలో షిండే పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డిపై విశ్వాసం లేకే ఆయనకు తమపార్టీ షిండే పాత్రను అప్పగించటం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోవాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకుంటున్నావని నిలదీశారు. రంజిత్‌రెడ్డి భూ, దేవాలయ భూముల ఆక్రమణలు, మొక్కజొన్న కుంభకోణాలు చేశారని ఆరోపించింది మీరే గదా? ఇప్పుడెందుకు విచారణ చేయించట్లేదు? ఏం మొహం పెట్టుకుని ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు? ఓట్లు ఎలా అడుగుతారు? అని రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నది వాస్తవం కాదా? ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తున్నావో తమ దగ్గర చిట్టా ఉందని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ డబ్బులు అందుతున్నాయనీ, తెలంగాణలో ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అందులో రూ.1500 కోట్లను ఢిల్లీకి పంపారనీ, ఇంకో ఐదొందల కోట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తుంది కదా? దానిపై విచారణ చేసేందుకు సీబీఐని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.