ఆ పార్టీకి ఓటేస్తే మూడు గంటలే కరెంటు

If you vote for that party, you will get electricity for three hours– కాంగ్రెస్‌ ఎవర్నీ ఓన్‌ చేసుకోలేదు…
– ‘కేసీఆర్‌ భరోసా’ను ఇంటింటికీ తీసుకెళ్లండి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌… ఏ ఒక్కర్నీ, ఏ ఒక్క తరగతినీ ఓన్‌ చేసుకోలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అందుకే అది అందరికీ దూరమవుతోందని విమర్శించారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి తదితరులు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత రాష్ట్రమైన కర్నాటకలో ప్రస్తుతం కరెంటు కష్టాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అక్కడి రైతులకు ఐదు గంటల కంటే ఎక్కువ సమయం కరెంటు ఇవ్వలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలిపారు. ఇక్కడ తెలంగాణలో ఆ పార్టీకి ఓటేస్తే మూడు గంటల కరెంటే దిక్కవుతుందని హెచ్చరించారు. అందువల్ల ఒక్క అవకాశమివ్వాలంటూ కోరుతున్న కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మి మోసపోవద్దంటూ ఓటర్లకు సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ప్రజలందరూ తమ పార్టీగా భావిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి, నిర్ణయాల వల్ల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేడు సస్యశ్యామలమైందని వివరించారు.
బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించటం ద్వారా కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎంగా చూడాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘కేసీఆర్‌ భరోసా’ పేరిట తమ పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈసారి అధికారంలోకి వస్తే ప్రతీయేటా జాబ్‌ క్యాలెండర్‌ను నిర్ణీత కాల వ్యవధిలో తప్పకుండా అమలు చేస్తామని హామీనిచ్చారు.