కొన్ని గమ్మత్తి గమ్మత్తి సామెతలు వుంటయి. ‘ఇచ్చంత్రాల పచ్చిపులుసుకు ఇద్దరిని రమ్మంటె ముగ్గురు వచ్చిరి, ముగ్గురి ఎనుక ముసలోడు అంబాడుకుంట వచ్చిండట’. అంటే పిలిచిందే పచ్చిపులుసుతో భోజనానికి. దానికి ఇద్దరు ఆలుమగలను రమ్మంటే ఇంకొకరు వచ్చుడు… ఇట్లా గమ్మత్తిగ పుడుతయి. ఇందులో ఆశబోతుతనం కన్పిస్తది. ఎవరు పిలుస్తరా అని ఎదిరి చూసే రకం మనుషుల కోసం పుట్టిన సామెత. ఇట్లాంటిదే మరొక సామెత కూడా వున్నది. ‘ఇత్తు ఇసిరి అంబలి కాసి ఇంటికి నల్గురిని పిలిచినట్లు’. ఏదన్న పండుగో పబ్బోజనమో వుంటే ఇంటింటికి పిలిస్తే ఎంత వండాలెనో అంటే వంటలు చేయాలి. గానీ సరిపోకుంట చేసేవాల్ల కోసం పుట్టిన సామెత. ఇత్తు అంటే ఒక గింజ. దానిని ఇసురుడు అంటె పిండి తయారు చేస్తే ఎందరికి సరిపోతది అనే వ్యంగ్యంలో వాడే సామెత. కొందరు మనుషులు ఒకే కుటుంబంలో ఒకే తీరు కనపడతరు. ఓ ఇంట్ల అందరు కోపగొండి వాల్లు వుండవచ్చు. లేకుంటే పిసినాసివాల్లు వుండవచ్చు. లేదా మందిది తిందాం తాగుదాం అనే రకం కావచ్చు. వాల్ల సట్టం అంత అట్లనే వుంటదని ‘ఇత్తోటి పెడితె చెట్టోటి అయితదా’ అంటరు. అంటే ఏ విత్తనం నాటితే ఆ చెట్టే పెరుగుతదనే అర్థంలో ఈ సామెతను వాడుతరు. అయితే అందరు ఇట్ల వుండాలి అని ఏమి వుండది. కానీ సామెతలు అట్ల పుడుతయి. ‘ఇత్తు ముందా చెట్టు ముందా’ అనే పొడుపు సామెత కూడా వున్నది. దీనిని ఇత్తే ముందు, ఇత్తు నుంచే చెట్టు ఉద్భవించింది అని వాదిస్తారు. లేదు చెట్టునుండే విత్తనం పుడుతది అనే వాదన కూడా సరదాగనైనా చేయవచ్చు.
– అన్నవరం దేవేందర్, 9440763479