గా దినం సీనన్న దుక్‌ణంల పాల పాకెట్ దేద్దావని వోతాంటే బస్తీల పోరలందరూ ఒక్కతాన జమైండ్రు. ఓ పోరన్ని దేత్తడి కొట్టుడే కొట్టుడు. ఒక పోరడు కాన్‌బైరీ ఇత్తుంటే, ఇంకో పోరడు గలీజ్, గలీజ్ తిట్లు తిట్టవట్టే. ఏమైందిరా గా పోరన్కి అందరు గల్శి దులాయి జేత్తాండ్రని అడుగుతుంటె ఎవరూ గైశేత్తలేరు. గప్పుడు గా గుంపుల కేళ్లి మీసాల రాజన్న బయటి కచ్చిండు. ఏమన్నా ఏం జరుగు తుందే గీ బస్తీల. పొరలందరు ఒక్కన్ని గిట్ల గొడుతుండ్రూ. ఏం తప్పులేదు తమ్మి. గానికి ఇంకా తన్నుల్ వడాల్సిందేనని ఏదో జెప్పవోతుంటే గప్పుడే పోలీసోల్లచ్చి అందర్ని పక్కకు జరిపి తన్నులు దిన్న పోరన్ని పట్టుకపోయిర్రు. గప్పుడు అసలు కత జెప్పిండు రాజన్న. గా పోరడు గీ గల్లీలకు నాలుగునెల్ల కిందనే కిరాయికచ్చిండు బాబన్నోల్లింట్లకు. ఏంజేత్తవనడిగితే సాఫ్ట్‌వేర్ అన్జెప్పిండట. గాల్లు గూడ గాపోరని గురించి వట్టించుకోలేదట. పొద్దుగాల లేవంగనే టిక్కుటాకుగా తయారై ఆఫీస్‌కని వోయి ఏ నడిజాం రాతిరికచ్చుడంట. సాఫ్ట్‌వేరనేసరికి బస్తీలందరుగా పోరనికి గల్లీల మస్త్ ఇజ్జతిచిండ్రు. మస్త్ పైసల్ కర్సువెడ్తుండే బస్తీల. బాగా సంపాయించే నౌకరని ఏవలకనుమానం రాలే. అసలు గా పోరడు జేసే పని అలగుంది. కాలేజీల పోంటి తిరుక్కుంటా సదువుకునే పోరలకు గంజాయి పాకెట్లు అమ్మే నౌకరి జేత్తాండు. గీ బస్తీల సదువుకునే పోరని కాలేజిల గంజాయా మ్ముతుంటే ఓసారీ కండ్లతోని జూశీండ్రు. గప్పుడుగా సాఫ్ట్‌వేర్ జేసే నౌకరి బస్తీల దెల్శిపోయింది. గీ పోరడు మన బస్తీలుంటే అందరం శెడిపోతమని పోరలందరికి బుగులు వుట్టింది. గంతే గీని కత సక్కగ జెయ్యాలని మోఖమీద దొరుకవట్టి దులాయి జేశిండ్రు తమ్మి. గీ పట్నంల ఎవ్వర్ని నమ్మాలో ఎవర్ని నమ్మద్దో తెల్తలేదు. ఒక్కటే బస్తీలుంటం, ఎవరేంజెత్తరో ఎవరికి తెల్వదు. అప్పుడప్పుడు ఊళ్లనుంచి సుట్టాలచ్చి గైన దెల్సా, గీనే దెల్సా అని అడుగుతాంటే సమజేగాదు. రాత్రింటికి వోయే సరికి గా పొద్దుగాల అడ్రసడిగిన మనిషి మన పక్కింట్లనే కనవడ్తడు. గట్లుంటది కథ. గా పల్లెటూల్ల శీమ శిటుక్కుమంటే ఊరంత దెల్తది. ఆపతికి సంపతికి ఏమైనా ఊరంతా ఉరికత్తరు.ఔ తమ్మీ… అప్పుడప్పుడనిపిత్తది నాకూ…గీ పట్నం కన్నా పల్లెటూల్లే నయ్యమని.
– ఊరగొండ మల్లేశం