– అద్భుతమైన ఆవిష్కరణకు వేదిక ఐఐటీలకు ఆద్యులు నెహ్రునే..
– క్రిటికల్ మినరల్స్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఐఐటీలు విద్యా సంస్థలు మాత్రమే కావని, దేశ నిర్మాణానికి దోహదపడే వేదికలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్ (కంది)లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రిసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐఐటీ హైదరాబాద్ అద్భుతమైన ఆవిష్కరణలకు చిరునామాగా మారిందన్నారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు దేశ భవిష్యత్‌కు కలల కర్మాగారం అని తెలిపారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు 11,500 పరిశోధనా ప్రచురణలు, 320కి పైగా పేటెంట్లు, స్టార్టప్‌ల ద్వారా రూ.1500 కోట్ల ఆదాయాన్ని అర్జించడం గొప్ప విషయమని అన్నారు. ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రిసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు కేవలం తెలంగాణకు, భారత దేశానికే కాకుండా ప్రపంచానికే కీలకంగా మారనున్నట్టు తెలిపారు. తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్‌షాప్ సహకార స్ఫూర్తికి అద్దం పడుతుందన్నారు. భారత్‌లో ఐఐటీలకు తొలి ప్రధాని నెహ్రుయే ఆద్యులని గుర్తు చేశారు. ఐఐటీలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా నెహ్రు అభివర్ణించినట్టు గుర్తుచేశారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ.. పేదరికం, అసమానతలపై పోరాడడానికి అవసరమైన సాధనాలుగా నెహ్రు పేర్కొన్నారని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ ఏర్పాటులో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. వైఎస్సార్ నాయకత్వంలోనే ఐఐటీకి పునాదులు పడ్డాయని చెప్పారు. వైఎస్సార్ గొప్ప రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వైఎస్‌ఆర్ ప్రయత్నించినట్టు తెలిపారు. ఐఐటీ ఏర్పాటు సమయంలో తాను ఎమ్మెల్సీగా భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో క్లిష్టమైన ఖనిజాలను వెలికితీసేందుకు సమర్ధవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్దతులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పరిశోధన, వాటి సంబంధిత సైన్స్ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. క్లిష్టమైన ఖనిజాలు పారిశ్రామిక పదార్ధాలు మాత్రమే కాదని, అవి హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడతాయన్నారు. సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ నిల్వ బ్యాటరీల వంటివి క్లిష్టమైన ఖనిజాల ద్వారానే తయారవుతాయని తెలిపారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్టు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్ ఇంధనంగా ప్రభుత్వాలు భావిస్తున్నట్టు తెలిపారు. ఆవిష్కరణల ప్రోత్సాహానికి, సుస్థిరతకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందన్నారు. ఐఐటీల ఆలోచనలు పరిశ్రమలను పునర్ నిర్వచించి, ఆర్థిక వ్యవస్థను పునర్మిస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, గౌరవ అతిధి కాన్సుల్ జనరల్ ఎంఎస్ హిల్లరీ మెక్‌గేచీ, ఆస్ట్రేలియన్ కాన్సులేట్-జనరల్ బెంగుళూరు, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, మైనింగ్ జాయింట్ సెక్రటరీ దినేష్ మహుర్, సింగరేణి కాలరీస్ సీఎండీ మోహన్ యెల్లిశెట్టి, ప్రొఫెసర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.