ఇవ్వాళ్ల తెలంగాణలో జరుగుతున్న బాల సాహిత్య వికాసం, సృజన విషయంలో సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల చరిత్ర లేకుండా చూడలేం. కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాల్లో తొంభయ్యవ దశకంలో బాల సాహిత్య వికాసోద్యమం ప్రారంభమైతే నేడు తెలంగాణ నేలంతా పూలు పూస్తోంది. అందులోనూ ఇటీవలి దశకంలో సిద్ధిపేటలో ఈ దిశగా విశేష కృషి జరిగిందని చెప్పొచ్చు. అలా కవిత్వం, పద్యం, గేయాల రచన చేస్తూనే బాలల కోసం సృజనశాలలను జరుపుతూ పిల్లల రచనలతో చక్కని పుస్తకాలను తెచ్చిన ఉపాధ్యాయిని, బాల సాహితీవేత్త మరో సిద్ధిపేట బాల సాహిత్య సిరి శ్రీమతి మచ్చ అనురాధ.
మచ్చ అనురాధ మార్చి 2, 1967న సిద్ధిపేట జిల్లాలోని చేనేతల ఖిల్లా దుబ్బాకలో జన్మించింది. శ్రీమతి మచ్చ భాగ్యలక్ష్మి, శ్రీ భూమయ్యలు వీరి అమ్మానాన్నలు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ తో పాటు తెలుగు పండిత శిక్షణ పూర్తిచేసిన అనురాధ బి.ఎడ్ చదివి కుకునూర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయినిగా పనిచేస్తోంది. కవయిత్రిగా అనురాధ రాసిన పద్యాలు, కవితలు, ఇతర రచనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఇరవై అయిదుకు పైగా సంకలనాల్లో వచ్చాయి. వివిధ పత్రికల్లో వీరి రచనలు అచ్చయ్యాయి. తాను పద్యం రాయడమేకాక తన బడిలోని పిల్లలతో చక్కని పద్య, గేయ రచనలు చేయించిన వీరు బాలల సాహిత్య వికాస దిశగా ముందువరుసలో నిలిచి పనిచేస్తున్నారు. బాల సాహిత్య రచన అచ్చులో వచ్చినప్పటికీ ‘వాస్తవికత’, ‘శివ స్మరణామృతం’ పద్య కావ్యాలు అచ్చులోకి రావాల్సిఉంది. గతంలో ఇదే శీర్షికలు పరిచయం చేసిన జగ్గారి నిర్మల, మచ్చ అనురాధలు సిద్ధిపేట జంట కవయిత్రులు, సామలేటి లింగమూర్తి దగ్గర పద్య విద్య నేర్చుకున్నారు. కుకూనూరుపల్లి బడి పిల్లల రచనలు ‘కుకునూరుపల్లి ఆణి ముత్యాలు’ పేరుతో అచ్చువేశారు. రచయిత్రిగా, ఉపాధ్యాయినిగా పలు సత్కారాలు, పురస్కారాలు అందుకున్న అనురాధ సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు వివిధ సంస్థల నుండి సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం, లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ సత్కారం, శతపద్య కంఠీరవ బిరుదు, ‘కృష్ణ కవిత’ ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం, యాదాద్రి శిల్పకళా వైభవం కవి సమ్మేళనం, జాతీయ సాహిత్య పరిషత్ వసంతోత్సవం, శతాధిక మహిళా కవి సమ్మేళనంలలో పాల్గొన్నారు. లంబోదర కల్చరల్ అసోసియేషన్ నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తి పురస్కారం కూడా అందుకున్నారు.
పద్యాన్ని, గేయాన్ని అద్భుతంగా రాయడమే కాక పాడడం అనురాధకు బాగా తెలుసు. బాలల కోసం అనురాధ తెచ్చిన గేయ సంపుటి ‘గేయ మాలిక’. అరవై నాలుగు కళలకు ప్రతీకగా 64 గేయాలతో తెచ్చిన గేయ సంపుటి యిది. తెలంగాణ గ్రామీణ నేపథ్యం కవియిత్రి అనురాధది. తన గేయాల్లో అది చక్కగా కనిపిస్తుంది. ‘తళ తళ మెరుపుల/ తంగెడు పూలు/ కళ కళ కాంతుల/ కట్ల పూలు/ గుబురుగ పూసిన/ గునుగు పూలు’ అంటూ బతుకమ్మను సింగారించే బంగరు పూల గురించి రాసినా, ‘చినుకు చినుకు రాలెను/ నేల తల్లి మురిసెను/ వేడి వేడి తొలిగెను/ ఎంతో హాయి కలిగెను/.. రైతు సంబురము/ రాజానికి శుభకరము’ అని రాసినా ఆ నేపథ్యం కనిపిస్తుంది. ‘చెట్లు గొట్టి వేయనేల?/ రోడ్లు పెద్ద జేయనేల?’ అని ప్రశ్నిస్తూనే, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూత్రాలను కూడా వివరిస్తుంది కవయిత్రి. అనురాధ తన గేయాల్లో పర్యావరణం, ప్రకృతి, జీవ జంతుజాలం వంటి వాటికి పెద్ద పీట వేశారని చెప్పొచ్చు. ‘కుహూ కుహూ కూతలు/ కోకిల పెట్టును’, ‘..అడవిలోని జంతువులు/ పుడమి మెచ్చు జంతువులు’, ‘అమ్మలాంటి ఆవును/ కమ్మని పాలు ఇచ్చును/… అమ్మకన్న మిన్నను/ ఆదుకొనును జనులను’, ‘పెద్ద తొండం ఏనుగు/ ముద్దు గుండును ఏనుగు’, ‘ఎలుకా ఎలుకా ఎందుకు నువ్వు/ గోడ తొర్రలో గూర్చుంటావు’, ‘..ఘల్లు ఘల్లు గుర్రము/ అందమైన గుర్రము’ వంటివి అందుకు ఉదాహరణలు. కేవలం హాయిగా, ఆనందంగా పాడుకునే గేయాలనేకాక ప్రతిరోజు ఉపాధ్యాయినిగా, తల్లిగా తాను చూస్తున్న బాలల సమస్యలపైన కూడా అనురాధ గేయాలు రాశారు. ‘పిల్లలు చిన్నగ/ బ్యాగులు పెద్దగ/ బస్సులు కొద్దిగ/ పరుగులు మిన్నగ/ సంఖ్యలు పెద్దగ/ గడులు చిన్నగ/ ఫీజులు మెండుగ’ అంటూ ఒక గేయంలో రాస్తుంది. ‘చల్లనైన ఇంటిలో/ పిల్లలుంటె అందము/ చక్కనైన పల్లెలో/ పాడిపంట అందము/ ..చెరువునిండ నీళ్లు ఉంటె/ చెరువుకెంతొ అందము/ చెరువులోన చేపలాడ/ చూడనెంతొ అందము’, ‘ఓడ నెక్కి పోదాము/ నీటి ప్రయాణము చేద్దాము/ విమానమెక్కి పోదాము/ విశ్వమంతా చూద్దాము’, ‘అంగడి వెళ్ళి వద్దామా!/ ఆట బొమ్మలు కొందామా/ అక్కకు గాజులు తెద్దామా!/ అరటి పండు కొందామా’ ఇంకా, ‘నానికి జిలేబి కొందామా/ తాతకు లడ్డూ తెద్దామా!’ వంటి గేయాలు లయాత్మకంగా ఉండి హాయిగా పాడుకునేందుకు బాగున్నాయి. ‘అమ్మ మాట వినాలి/ ఆదర్శంగా నిలవాలి’ అన్ని ఎలుగెత్తి చాటిన ఈ తెలుగమ్మ గేయాలకు జయహో!
– డా|| పత్తిపాక మోహన్
9966229548