– కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులం ముత్తిలింగం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఇల్లందు పట్టణం ఆర్టీసీ డిపో నుంచి ఆళ్ళపల్లి మండలంలోని మర్కోడు గ్రామం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, కోశాధికారి తులం ముత్తిలింగం అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మండల కేంద్రంలో నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. గతంలో ఆళ్ళపల్లి మండలం ప్రజలు నిత్యావసర సరుకులు, వ్యాపార లావాదేవీలు, విద్య, వైద్యం నిమిత్తం రాకపోకలు ఇల్లందుకు అధికంగా ఉండేవన్నారు. దాంతో పాటు మండలానికి వచ్చే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు సైతం బస్సులోనే ప్రయాణం చేసేవారని, దాంతో ఆక్యూపెన్సీ పెంచి ప్రభుత్వానికి, బస్సు యాజమాన్యానికి అధిక లాభాలు చేకూర్చిన రోజులను ఉదహరించారు. అంతంత మాత్రంగానే ఉన్న నాటి రోజుల్లో ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు నడిచాయని, గ్రావెల్ మార్గంలో ప్రస్తుతం కిన్నెరసానిపై వంతెన, ఇల్లందు నుంచి మండల పరిధిలోని మర్కోడు వరకు ఎక్కడా అవాంతరం లేని బీటీ రోడ్డు ఏర్పాటై సంవత్సరాలు గడుస్తున్నా గాని, ఇల్లందు నుంచి ఆళ్ళపల్లి మండలానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 2023లో నూతనంగా ఇల్లందు పట్టణంలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేసినా బస్సు సౌకర్యం ఆళ్ళపల్లికి పునః ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. కాగా అనంతోగు కాచనపల్లి గ్రామాల మధ్య అడవిలో 6 కిలోమీటర్ల మేర బీటీ సింగిల్ రోడ్డు ఉండి, ఆ బాటన ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లి కేవలం గత ఏడాది కాలంలోనే 4 మృతి చెందారని, అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, సురక్షితమైన ప్రయాణాలకు ఇకనైనా విద్య, వైద్య, వ్యాపారం, ఉద్యోగం, తదితర ప్రజల అవసరాల దృష్ట్యా పినపాక, ఇల్లందు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్యలు ఆర్టీసీ బస్సు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మేడారం నిండు జాతర ముగిసేవరకు ఆళ్ళపల్లి భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం లేదా ఇల్లందు డిపో నుండి మండలానికి వచ్చి వయా గుండాల మీదుగా బస్సు మేడారంకు వెళ్లేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు నడపాలని విజ్ఞప్తి చేశారు.