– దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
– ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర
నవతెలంగాణ-కాప్రా
హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఎలాంటి ధర్నా, ముట్టడి కార్యక్రమాలకు పిలు పు ఇవ్వకపోయినా నాచారం పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర అన్నారు. శుక్రవారం నాచారం పోలీసులు ధర్మేంద్రను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాచారం పోలీసులు దురుసు ప్రవర్తన, అసభ్య పదజాలంతో దూషిస్తూ ముందస్తు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన కానిస్టేబుల్ జే. సుదర్శన్ అసభ్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఏఐవైఎఫ్ సంఘం ఎలాంటి ధర్నాలకు పిలుపు ఇవ్వలేదని చెప్పినా కానిస్టేబుల్ వినడలేదన్నారు. కమ్యూనిస్టులు రాజ్యాంగ సూత్రాలకు లోబడే ఉంటారని గుర్తించుకోవాలని హితవు పలికారు. పోలీసు ఉన్నతాధికారులు దూషించిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ పర్యటన అంటూ విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేని ధ్వజమెత్తారు. మోడీ నిరంకుశ విధానాలు దేశానికి నష్టమని, మూడోసారి ప్రధాని కావాలనే మోడీకి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అక్రమ అరెస్టులు చేయడం హేయం : వీ.ఎస్. బోస్
మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని యువజన సంఘాల నాయకులను, ప్రజాస్వామిక వాదులను అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని వీఎస్‌బోస్ అన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్ర తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు సామరస్యంగా జీవిస్తున్న దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, లౌకిక విలువలకు తూట్లు పొడిచే వినాశకర చర్యలకు పూనుకుందని పేర్కొన్నారు. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న మోడీ లోక్‌సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ (సవరణ) చట్టం-2019ను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం నీచమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాచారం డివిజన్ కార్యదర్శి కపాకర్, ఏఐటీయూసీ కాప్రా మండల కార్యదర్శి మిరియాల సాయిలు పాల్గొన్నారు.