స్కీమ్‌ వర్కర్ల అక్రమ అరెస్టులు

– మలుగు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధం
– రాత్రే సీఐటీయూ, ఏఐటీయూసీ నేతల అరెస్ట్‌
– పోలీసులకు, ఆశ వర్కర్లకు మధ్య తోపులాట
– ఆశా వర్కర్‌ చేతికి గాయం
– పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే సీతక్క
– ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌ ఛాంబర్‌ ముందు బైటాయింపు
నవతెలంగాణ – ములుగు
కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత.. ఇతర సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తోంది. సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాకపోగా.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు తెగబడుతోంది. గురువారం ములుగు జిల్లా పర్యటనకు మంత్రి హరీశ్‌రావు వస్తున్నాడన్న సమాచారంతో ఆయన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాత్రికి రాత్రే సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులను అరెస్టు చేశారు. గురువారం ఉదయం ములుగు చేరుకున్న వాళ్లని చేరుకున్నట్టే అరెస్టు చేసి పోలిస్‌ స్టేషన్‌కు తరలించారు. కొంతమంది ఆశ వర్కర్లు మంత్రి సభా స్థలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. మిషన్‌ భగీరథ కార్యాలయం వద్ద పోలీసులు ఆపారు. దీంతో పోలీసులకు, ఆశ వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆశ వర్కర్‌ చేతికి గాయమైంది. బలవంతంగా ఆశా వర్కర్లందర్నీ డీసీఎంలో ఎక్కించుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్‌లో ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల, సీఐటీయూ నాయకులను ఎమ్మెల్యే సీతక్క కలిసి సంఘీభావం తెలిపారు. అందరూ కలిసి ర్యాలీగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రి ముందు జాతీయ రహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని లోపలికి చొచ్చుకెళ్లి కలెక్టర్‌ ఛాంబర్‌ ముందు బైటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అని చూడకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో నిర్వహించే సభలో ప్రజా సమస్యలపై విజ్ఞాన పత్రాలు కూడా స్వీకరించకుండా అక్రమ అరెస్టులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆయా కార్మిక యూనియన్లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, మల్లాడి రామ్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మక్క, పద్మ, నీలాదేవి, మంజుల తదితరులు ఉన్నారు.