విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అక్రమ అరెస్ట్ లు 

Illegal arrests of student and youth union leaders– 46 శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి
– విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ 
– ప్రతి పరీక్షకు 45 రోజుల గడువు ఇవ్వాలి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
డీఎస్సీ, గ్రూప్స్ నిరుద్యోగులు, విద్యార్థి,యువజన సంఘాలు ఇచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపద్యంలో నల్లగొండలో పిడిఎస్యూ,డివైఎఫ్ఐ, పివైఎల్ సంఘాల నాయకులు ఇందూరు సాగర్,మల్లం మహేష్, బి.వి.చారితో పాటు నిరుద్యోగులను సోమవారం తెల్లవారు జామున వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోటి ఆశలతో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకులు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేదని అన్నారు. డిఎస్సి, గ్రూప్స్ 2,3,4 లలో పోస్టులు పెంచి ఒక్కో పరీక్షకు కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలని పేర్కొన్నారు.1:50ప్రకారం కాకుండా 1:100ప్రకారం పిలవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల అబ్యార్థనను ను పట్టించుకోకుండా నిరంకుశంగా నిర్బంధం ప్రయోగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 46 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అర్ధ రాత్రులు అరెస్ట్ లు చేయడం, అరెస్టుల ద్వారా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరాకాష్ట కు నిదర్శనమని ఎద్దేవచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన విద్యార్థి,యువజన సంఘాల నాయకులను,నిరుద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  అరెస్ట్ అయిన వారిలో డివైఎఫ్ఐ,  పిడిఎస్ యు పివైఎల్ నాయకులు మాదాస్ రావన్,అభిలాశ్, నరేష్, ఉపేందర్, కిరణ్, స్వామి తదితరులు ఉన్నారు.