సమస్యలు పరిష్కరించాలంటే అక్రమ అరెస్టులా..?

– ప్రభుత్వ విద్యాసంస్థల దుస్థితి ఏమిటో సీఎం మనుమడే చెప్పిండు
– ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
– వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్‌
– నారాయణగూడ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరితే అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. బుధవారం చేపట్టిన బంద్‌ సందర్భంగా పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టులు, లాఠీ చార్జీకి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. అందులో భాగంగా హైదరాబాద్‌ నారాయణగూడ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంద ర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర నేతలు టి.నాగరాజు, ఆర్‌ఎల్‌.మూర్తి(ఎస్‌ఎఫ్‌ఐ), పుట్టా లక్ష్మణ్‌ (ఏఐఎస్‌ఎఫ్‌), మహేష్‌, ఎస్‌.నాగేశ్వర రావు, రామకృష్ణ (పిడిఎస్‌యు), మల్లేష్‌ (ఏఐడి ఎస్‌ఓ), గవ్వ వంశీధర్‌ రెడ్డి (ఏఐఎస్‌ బి) మాట్లాడారు.
టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం దుస్థితి ఏమిటో సాక్షతూ సీఎం కేసీఆర్‌ మనుమడే చెప్పాడని, అయినా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల ధర్నాలు, ఆందోళనలకు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.. సమస్యలపై పోరాడే వారిని బట్టలు చింపి, బూతులు తిడుతూ అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎల్‌.మూర్తి మాట్లాడుతూ.. వెంటనే రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని కోరారు. ఖమ్మంలో ప్రయివేటు రౌడీలతో విద్యార్థి నేతలపై దాడి చేయించిన ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేసి, పాఠశాల అనుమతి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పుట్టా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారించ కుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు డి.కిరణ్‌, కె.అశోక్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు లెనిన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర యూనివర్శీటీల కన్వీనర్‌ రెహమాన్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి జి.నరేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.క్రాంతి, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం శ్యామ్‌, ఎఐడిఎస్‌ఓ హైదరాబాద్‌ జిల్లా నాయకులు వెంకటేష్‌, సృజన్‌ తదితరులు పాల్గొన్నారు.