ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులపై ఢిల్లీలో అక్రమ కేసు కొట్టివేత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులపై ఢిల్లీలో అక్రమంగా నమోదు చేసిన కేసును న్యాయస్థానం కొట్టేసిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, కేరళ ఎంపీ వి శివదాసన్‌ సహా 10 మంది నిందితులను 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం ఢిల్లీ రోజ్‌ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిర్దోషులుగా విడుదలైన వారిలో కేరళ రాజ్యసభ సభ్యులు, అప్పటి ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వి. శివదాసన్‌ సహా, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర తొలి అధ్యక్షుడు మూడ్‌ శోభన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నూర్‌ మహమ్మద్‌, పగడాల లక్ష్మయ్య, ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి మందుల ఉపేదర్‌, ఆంద్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వై. రాము, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణ, మాజీ నాయకులు శత్రుప్‌ ఘోష్‌, జెఎన్‌యూ మాజీ నాయకులు ఎన్‌. రాహుల్‌ ఉన్నారు. ఈ కేసులో ఆచూకీ తెలియని పద్నాలుగు మందిపై దర్యాప్తు చేయాలని రోజ్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కేరళ హౌస్‌ హింస కేసులో పది మంది నిందితులను నిర్దోషులుగా ఢిల్లీ రోజ్‌ అవెన్యూ కోర్టు తీర్పుని చ్చింది. దీంతో వారు విడుదలయ్యారు. పది మంది నిందితులు నేరం చేశారని నిరూపించలేమని కోర్టు పేర్కొంది. నిర్దోషులుగా విడుదలైన వారిలో 10 మంది ఉన్నారు. 2013లో సోలార్‌ కుంభకోణం సందర్భంగా కేరళ హౌస్‌ వద్ద ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ దిష్టిబొమ్మను దహనం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఈ కేసు నమోదైంది. అక్రమంగా 14 రోజులు తీహార్‌ జైల్లో ఉంచారు. కేరళ హౌస్‌ భవనంలోని కార్‌ పోర్చ్‌పై దిష్టిబొమ్మను తగలబెట్టి, దానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించడం వంటి ఆరోపణలపై నిందితులు విచారణను ఎదుర్కొ న్నారు. రౌస్‌ అవెన్యూలోని స్పెషల్‌ కోర్ట్‌ ఆఫ్‌ రిప్రజెం టేటివ్స్‌లో 24 మంది నిందితుల్లో ఇప్పటివరకు 10 మందిపై మాత్రమే విచారణ జరిగింది. కేరళ హోం కార్యదర్శి బిశ్వనాథ్‌ సిన్హా సహా సాక్షులు కోర్టు ముందు హాజరయ్యారు. అయితే, నిందితులు చాలా సంవత్సరాల వయస్సు గలవారు కాబట్టి వారిని గుర్తించలేకపోయానని సిన్హా వాంగ్మూలం ఇచ్చారు. ఈ సంఘటన జరిగినప్పుడు బిశ్వనాథ్‌ సిన్హా కేరళ హౌస్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాదులు సుభాష్‌ చంద్రన్‌ కెఆర్‌, కృష్ణ ఎల్‌ఆర్‌ వాదనలు వినిపించగా, ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అభిషేక్‌ వాదనలు వినిపించారు.