జానయ్యయాదవ్‌పై అక్రమ కేసులను ఎత్తివేయాలి

నవతెలంగాణ-సూర్యాపేట
ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంహెచ్‌ చైర్మెన్‌ వట్టెజానయ్యయాదవ్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ దీపిక బిల్లా, రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ జ్యోతి యాదవ్‌, బీసీ మహిళా సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ మంజులగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక గాంధీ నగర్‌ లోని వట్టేజానయ్య యాదవ్‌ కుటుంబాన్ని వారు పరామర్శించిన అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.జానయ్య కుటుంబానికి రాష్ట్ర బీసీ మహిళా విభాగం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.9 ఏండ్ల కాలంలో పెట్టని కేసులు, బహుజన వాదం ఎత్తుకోగానే రాత్రికి రాత్రి 71 పైగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తక్షణమే వట్టే జానయ్య యాదవ్‌ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.జానయ్య ఆచూకీ మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలుసని, అతను ఎక్కడున్నా కుటుంబానికి అప్పగించి, ఆ కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. కేసులు ఎత్తి వేయని పక్షంలో బీసీ మహిళా సంఘం జానయ్య యాదవ్‌కు అండగా ఉండి కేసులు ఎత్తివేసే అంతవరకు నిరంతరం పోరాడుతామని హెచ్చరించారు.గత ఎన్నికల్లో మంత్రి జగదీష్‌ రెడ్డి గెలుపు కోసం కషి చేసిన జానయ్య యాదవును కక్ష సాధింపు ధోరణి తో అక్రమ కేసులు పెట్టడం సముచితం కాదని తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కష్ణయ్య సూచన మేరకు జానయ్య కుటుంబానికి మద్దతు తెలిపేందుకు వచ్చామని పేర్కొన్నారు.బహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగిన అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో శిరీష, మహిళా విభాగం నాయకురాలు శైలజ మహేశ్వరి, మహేశ్వరి, అనిత, విజయ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.