– యూఎస్‌పీసీ, జాక్టో డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ సంఘ నేతలపై గత ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును ఎత్తేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పీఆర్సీ అమలు చేయాలనీ, పదోన్నతులు చేపట్టాలని కోరుతూ 2020, డిసెంబర్ 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో యూఎస్‌పీసీ, జాక్టో ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించిన సందర్భంగా యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, టి లింగారెడ్డి, జాక్టో చైర్మెన్ జి సదానందంగౌడ్‌పై పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఆ కేసును ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీసుల ముందస్తు అనుమతితో శాంతియుతంగా ధర్నా జరిగినప్పటికీ అనుమతించిన సంఖ్యకు మించి ఉపాధ్యాయులు ఎక్కువ హాజరయ్యారనే అక్కసుతో నాయకులపై ఆనాటి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకున్నదని తెలిపారు. ప్రతినెలా రెండు రోజులు కోర్టు వాయిదాలకు తిరగాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఆ కేసును ఎత్తేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు యూఎస్‌పీసీ, జాక్టో పక్షాన వినతిపత్రాలను సమర్పించినా ఇంకా చర్యతీసుకోలేదని తెలిపారు. అక్రమంగా బనాయించిన ఆ కేసును వెంటనే ఎత్తేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.