– ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుంది : హరీశ్‌రావు
– కాంగ్రెస్ పార్టీలో చేరనందుకే అక్రమ కేసులు : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ – పటాన్ చెరు
కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్రమ కేసుల నమోదుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని, మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అరెస్టును తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వంద రోజుల పాలన ఎలా తయారు అయ్యిందంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే లేదంటే అక్రమ కేసులు నమోదు చేయాలి అన్న రీతిలో ఉన్నద విమర్శించారు.
వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని,అంత అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని వచ్చి పోతుంటాయని, గత పదేండ్లలో ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించ లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల క్వారీల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధించామని, తాము తప్పు చేస్తే మూడుసార్లు గెలిచే వాళ్ళమా అనిఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల మనసు గెలవండి ప్రతి పక్షం లేకుండా చేయాలనుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్‌పార్టీలో చేరనందునే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. కక్షపూరిత అరెస్టులను మానుకోవాలన్నారు.
2012-13 లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతులతోనే క్వారీలను ప్రారంభించడం జరిగిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.