– జిల్లా పూసల సంఘము అధ్యక్షులు ముద్రకొల ఆంజనేయులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సమ్మక్క సారక్క జాతరలో నిర్వాహకులు చిరు వ్యాపారుల దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్న అక్రమ వసూలను నిలిపివేయాలని జిల్లా పూసల సంఘము అధ్యక్షులు ముద్రకొల ఆంజనేయులు అన్నారు. తంగళ్ళపెల్లి మండలం ఓబులాపూర్ గ్రామం లో జరిగే మూడు రోజుల సమ్మక్క సార్లమ్మా జాతర లో నిర్వాహకులు చిరు వ్యాపారుల వద్ద నుండి అక్రమ వసూలు చేస్తున్నారని ఆయన బుధవారం ఆరోపించారు. రోజు వారి జాతర లో పూసల కులానికి చెందిన నిరుపేదలు, ఇతర సంచార జాతులలో కులాలు జాతర లో అమ్మకాలు జరుపుతుంటారని వారి వద్ద నుండి సమ్మక్క సారక్క జాతర నిర్వహించే నిర్వాహకులు నాలుగు గజాల స్థలం కోసం అక్రమంగా రూ.2వేలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు చెల్లించకపోతే చిరు వ్యాపారులపై నిర్వాహకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ దుకాణాలను తొలగించాలని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.విక్రయిస్తున్న దుకాణదారులపై డబ్బులు వసలు చేయడం సరైనది కాదని ఈ సందర్భంగా హెచ్చరించారు. జాతరలో చిరు వ్యాపారులపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆలయ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను, మండల తాసిల్దార్, ఆర్డీవోను ఈ సందర్భంగా వారు కోరారు.