చింతలకుంట చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

Illegal excavation of soil in Chintalakunta pond– పట్టించుకోని  అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం రెవెన్యూ శివారులోగల చింతలకుంట చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు గత రెండు రోజులుగా జోరుగా సాగుతున్నా రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు అనుమతులు లేకుండానే అడ్డుఅడుపు లేకుండా పరిమితికి మించి నాలుగైదు పిట్ల లోతుగా గోతులు జేసిబితో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ కోసం తరలిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టడంతో భవిష్యత్ లో మత్స్యకారులు, పశువులు గోతుల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెంజరువు, ఈదుల చెరువుల్లో ఇలాంటి గోతులు తీయడంతో ప్రమాదాలు జరిగిన సంఘటలున్నాయి. ఈ అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులను నవ తెలంగాణ వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అక్రమంగా చెరువుల్లో మట్టి తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.