వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ల అక్రమ చొరబాటు

Illegal intrusion of corporates with agricultural lawsవ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన పత్రం (ఎన్‌.పి.ఎఫ్‌.ఎ.ఎమ్‌) పేరిట కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఆరెస్సెస్‌, బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వ కుత్సిత ఉద్దేశాలను బహిర్గతం చేస్తున్నది. రైతుల ప్రయోజనాలను బలిపెట్టి కార్పొరేట్‌ లాభాలను అత్యధిక స్థాయికి చేర్చడం కోసం పన్నిన పన్నాగమిది. రైతాంగ ఉద్యమం ముందుకు తెచ్చిన ఏ ఒక్క కోర్కెనూ కేంద్రం తీవ్రంగా తీసుకోలేదని ఈ ముసాయిదా స్పష్టం చేస్తుంది. గరిష్ట మద్దతు ధర (ఎం.ఎస్‌.పి)ను చట్టబద్ధం చేయడం, వ్యవసాయం పై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, రైతాంగానికి అనుకూలమైన పరపతి సదు పాయాలు కలిగించడం వంటి కోర్కెలను అసలు పట్టించు కోలేదని తెలుస్తున్నది. రాజ్యాంగం 246వ అధికరణం ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్‌ రాష్ట్ర ప్రభుత్వ జాబితా లోనిదని కంటితుడుపుగా ఒప్పుకుంటూనే ఆ ముసాయిదా ప్రధాన శైలి మాత్రం సమాఖ్య విధానంపై రాష్ట్రాల అధికారాలపై దాడి చేసేదిగా వుంది. రాష్ట్రాల ప్రాయోజితమైన మార్కెట్‌ మౌలిక సదుపాయాలను నిర్మూలించడం, ఎ.పి.ఎం.సి ల పాత్రను రద్దు చేయడం, చిన్న మధ్యతరహా రైతాంగాన్ని ప్రయివేటు వ్యాపార కూటములకు విపరీతంగా లోబడిపోక తప్పని పరిస్థితి కల్పించడానికి దారితీసేదిగా వుంది.
ప్రధానంగా ప్రయివేటు కోసమే!
ప్రయివేటు హోల్‌సేల్‌ మార్కెట్ల ఏర్పాటు, ముఖద్వారంలోనే కార్పొరేట్‌ వ్యాపారులు, ఎగుమతిదారులు కొనుక్కునే అవకాశం కల్పించడం వంటి అంశాలు ఈ ముసాయిదా ప్రధానంగా సూచిస్తున్నది. సంప్రదాయక వ్యవసాయ మార్కెట్‌ యార్డుల స్థానంలో కార్పొరేట్‌ అధీనంలోని గోదాములు, సిలోలు తీసుకురావడం, రాష్ట్ర వ్యాపిత మార్కెట్‌ ఫీజును వాణిజ్య ఫీజును ప్రవేశ పెట్టడం వంటివి ఈ ముసాయిదాలో ప్రధానంగా సూచించిన సంస్కరణల్లో వున్నాయి. బడా కార్పొరేట్లు ఎ.పి.ఎం.సి మార్కెట్‌ యార్డులను తోసిపుచ్చి తామే నేరుగా రైతుల ఉంచి కొనుగోలు చేయాలని ఆ ముసాయిదా ప్రతిపాదిస్తున్నది. రిలయన్స్‌, అదానీలతో సహా బడా కార్పొరేట్‌ కంపెనీలకు విస్తారమైన గోదాము వ్యవస్థ వుంది. హర్యానాలోని సిస్రా, పంజాబ్‌లోని లుధియానాలలో ప్రయివేటు రైల్వే నెట్‌వర్క్‌ కూడా వుంది.
ఎం.ఎస్‌.పి ఎందుకు గిట్టదు?
ఎం.ఎస్‌.పి అనే దానికి కార్పొరేట్‌ లాబీ, అలాగే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు పచ్చి వ్యతిరేకతతో వున్నారు. ఎందుకంటే వ్యవసాయోత్పత్తులను కారుచౌకగా కొనేయడమే ఎప్పుడూ వారి వ్యూహంగా వుంటున్నది. దానికి కొంత నాణ్యత జోడించి బ్రాండు వేసి మార్కెట్‌లో అమ్ముకోవడమే వారి లక్ష్యం. ఈ క్రమంలో విపరీతమైన లాభాలు గుట్టలు పోగు పోసుకోవాలని చూస్తారు. ఈ విధంగా బడా వ్యాపార వర్గాలు రైతులనూ అలాగే వినియోగదారులను కూడా దోచుకుంటున్నాయి. మార్కెట్‌ సామర్థ్యం పేరుతో కేంద్రం వ్యవసాయోత్పత్తులను కార్పొరేట్‌ లూటీకి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నది. కార్పొరేట్‌ పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ప్రాథమిక ఉత్పత్తిదారులైన రైతుల నుంచి తాము కబళించిన అదనపు లాభంలో కొంత శాతాన్నయినా వారు అందించిన ముడి సరుకుకు గిట్టుబాటు ధరగా కలపాలని ముసాయిదాలో ఎలాంటి నియంత్రణ నిబంధన పెట్టలేదు. ఈ విధంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకు లొంగిపోతున్నది. రైతాంగ ఆత్మహత్యలు, రుణభారం కొనసాగడానికి కారణమవుతున్నది. రైతాంగం దివాళా తీసే పరిస్థితిని సృష్టిస్తున్నది.
ఎ.పి.ఎం.సి చట్టాన్ని రద్దు చేయడంతో బీహార్‌లో మండీలుపోయాక ఎలాంటి శోచనీయ పరిస్థితులు ఏర్పడ్డాయో ఈ నివేదిక డాక్యుమెంటుగా నివేదించడం చెప్పుకోదగిన అంశం. ఇదెంతో వైరుధ్యభరితం. పరాకాష్ట. ఎందుకంటే ఢిల్లీలో రైతాంగ పోరాటం తారా స్థాయిలో వుండగా ఆరెస్సెస్‌- బీజేపీ వర్గాలు, కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితులైన కార్పొరేట్‌ వర్గాలు ఎ.పి.ఎం.సి చట్టం రద్దును వ్యవసాయ మార్కెట్ల నియంత్రణ ఎత్తివేతకు గొప్ప ఉదాహరణ అన్నట్టు కథనాలు ప్రచారంలో పెడుతూ వచ్చాయి.
వ్యవసాయం కార్పొరేటీకరణ
వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని ఈ ముసాయిదా సుస్పష్టంగా చెబుతోంది. వ్యవసా యాన్ని సంస్కరించడానికి అదొక్కటే మార్గమని చూపిస్తున్నది. ఉదాహరణకు ఈ ముసాయిదా ఎంతో గొప్పగా చెప్పబడిన మోడీ అత్యంత ప్రియ పథకమైన ఎఫ్‌.పి.వో పథకం కార్పొరేట్‌ చొరబాటుకు మార్గంగా ఊహిస్తున్నది. దీని ప్రకారం ఎఫ్‌.పి.వోలు క్లస్టర్ల ప్రాతిపదికగా బడా వ్యాపార సంస్థలతో కాంట్రాక్టు ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగడానికి సానుకూల వాతావరణం సృష్టించాల్సి వుంటుంది. ఎఫ్‌.పి.వో పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి వీలుగా సి.ఐ.ఐ, ఎఫ్‌.ఐ.సి.సి.ఐ వంటి కార్పొరేట్‌ గ్రూపులు చూపి స్తున్న మహా ఆరాటం ఇప్పుడు ఆవిష్కృతమ వుతున్నది.
ఫ్యూచర్స్‌ బహిరంగ మార్కెట్‌ ద్వారా పెట్టుబడుల ప్రవేశాన్ని మరింత లోతుకు తీసుకుపోవాలన్న సూచనను కూడా ఇదే బడా వ్యాపార సంస్థల ఉచ్చుగా మాత్రమే చూడవలసి వుంటుంది. దీనివల్ల బహుళజాతి కంపెనీలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు దేశీయ ఆహార పరిశ్రమలోకి ప్రవేశించి ఆధిక్యత సంపాదించి నియంత్రించేందుకు అవకాశం లభిస్తుంది. తద్వారా భారతీయుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.ఈ ముసాయిదాకు ఇప్పటికే గట్టి ప్రతిఘటన మొదలైంది. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపుపై ఈ ముసాయిదాను దగ్ధం చేస్తూ దేశ వ్యాపితంగా వేలాది మంది రైతులను డిసెంబరు 23న ప్రదర్శనలో సమీకరించింది. అదే విధంగా జనవరి 26న ట్రాక్టర్లు/వాహనాల ర్యాలీల్లోకి తీసు కొచ్చింది. హర్యానాలోని తొహనాలోనూ పంజాబ్‌ లోని మోగాలోనూ జరిగిన రెండు మహా కిసాన్‌ పంచాయత్‌లలోనే 75 వేల మంది రైతులు సమీకృ తులైనారు. ఇటీవలనే ఢిల్లీలో జరిగిన ఎస్‌.కె.ఎం జాతీయ సమావేశాలు ఈ పోరాటాన్ని మరింత తీవ్రం చేయాలని ప్రతినబూనాయి.భారత దేశ వ్యవసాయ రంగాన్ని దేశ విదేశీ కార్పొరేట్లకు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించాలని చూస్తున్న బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రభుత్వ ప్రయత్నాలను అన్ని తరగతుల ప్రజలూ బలంగా ప్రతిఘటించడం అవసరం.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ జనవరి 29 సంపాదకీయం)