అక్రమ మోరం తరలింపు…

– ప్రేక్షక పాత్రలో అధికారులు…
నవతెలంగాణ-నసురుల్లాబాద్
అధికార పక్ష నేత పేరుతో మొరం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాగే ప్రైవేటు వ్యక్తులకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రాముల గుట్ట తాండ, బస్వాయి పల్లి, ప్రాంతం నుంచి 15 రోజులుగా అక్రమంగా మొరం తరలిస్తుండడమే ఇందుకు నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ సహాయంతో టిప్పర్లుతో మొరాన్ని తరలిస్తున్నారు. ఇటీవల మండలంలోని ఓ రైస్ మిల్ పనుల కోసం మొరం తరలిస్తున్నారు. అలాగే నాచుపల్లి శివారులోని రాముల గుట్ట తండా నుంచి మొరం తవ్వి ఓ ప్రవేట్ రైస్ మిల్ నిర్మాణానికి తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చిన పట్టించుకోని అధికారులు. అలాగే బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఓ ప్రైవేటు రైస్ మిల్ నిర్మాణాలకు ఒక్కో టిప్పర్‌కు సుమారుగా రూ. 2500–3500ల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా మొరం తవ్వుతూ అక్రమంగా తరలిస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులే బినామీ కాంట్రాక్టర్లుగా మారడంతో ప్రజలు ఏమాత్రం అడ్డుకోలేని పరిస్థితులున్నాయి. ఇదేమిటని ప్రశ్నించే వారిని బెదిరించడం తంతుగా మారింది. సంబంధిత అధికారికి సమాచారం ఇస్తే ఆ వ్యక్తి పేరును నాయకులకు చెబుతుండడంతో ప్రశ్నించేందుకు పలువురు జంకుతున్నారు. అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుచెప్పారు కానీ ఎలాటి అనుమతి లేక పోవడం, కనీసం రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వక పోవడం స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షక పాత్రలో అధికారులు
అక్రమాలను అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన స్థానిక అధికారులు తమ ప్రాంతంలో అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు జరుపుతున్నా తమకేమి పట్టనట్లుగా వ్యవహారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మొరం అక్రమ రవాణాను నిలిపివేయించాలని స్థానికులు కోరుతున్నారు