– ఖానాపూర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
గతంలో కాంగ్రెస్ ఇందిరామ్మ ఇండ్లు మంజూరు చేసిన సమయంలో ఖానాపూర్ చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలని కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రశ్నించారు. బుధవారం ఖానాపూర్ చెరువు ప్రాంతంలో అధికారులు సర్వేలు నిర్వహిస్తున్న ఏరియాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బైక్‌పై కాలనీలో తిరుగుతూ ప్రజలను కలిసి వారికి భరోసా ఇచ్చారు. ఇండ్లు కూలగొట్టకుండా తము ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన గంగన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు భయభ్రంతులకు గురి చేస్తుందన్నారు. ఖానాపూర్ చెరువు పరిసరాల్లో నివాసం ఉంటున్న వారికి అక్రమ కట్టడాలని అధికారులు సర్వే చేస్తుండడంతో వారికి రాత్రిళ్లు నిద్ర ఉండడం లేదన్నారు. గడిచిన తొమ్మిది నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఇండ్లను కూల్చివేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఏ పని చేయాలన్న స్పష్టత ఇచ్చిన తరువాతనే ముందుకు సాగాలన్నారు. పేదలకు కష్టం కలిగించేల వ్యవహరిస్తే చూస్తు ఉరుకొబోమని స్పష్టం చేశారు. బాధితులకు ముందు ప్రత్యామ్నం చూపకుండా సర్వే పేరిట ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు లాలామున్న, ఆకులప్రవీణ్, భీంసెన్ రెడ్డి, కృష్ణ, రాజేష్, సతీష్, విజరు ఉన్నారు.