– లబ్దిదారుడు ఒక్కరే.. పంపిణీ పలువురికి
– గులాబీ మార్కు రాజకీయం
– లోపాయకారి ఒప్పందాలతో
– ఎన్నికలను గట్టేక్కే యత్నం
– దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలకు చెదలు
– దూ(దు)రాలోచనలో సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమల్లో అక్రమాలకు తెరతీస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీచేస్తూ వచ్చే ఎన్నికలను గట్టేక్కే ప్రయత్నం చేస్తున్నది. ఎక్కువ మందికి లబ్దిచేకూర్చేందుకు తాను రూపొం దించిన విధానాన్ని తానే ఉల్లంఘిస్తున్నది. జిల్లాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుండటం గమనార్హం. దళిత, బీసీ, మైనార్టీ బంధు , గృహలక్ష్మి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా అమలవుతున్నాయి. పథకాలకు ఎంపిక చేసిన అసలైన లబ్దిదారులతోపాటు ఇతులకూ సర్దుబాటు చేస్తున్నది. రికార్డుల్లో అధికారికంగా ఒక పేరు ఉంటే, అనధికారికంగా మరో ఇద్దరు, ముగ్గురికి పథకాన్ని వర్తింపజేసి తమ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇందుకు ఆయా పథకాల లబ్దిదారులు, ఇతరుల మధ్య లోపాయకారి ఒప్పందాలను కుదురుస్తున్నది. ప్రభుత్వ ఫలాలను ఎరవేయడం ద్వారా ప్రతిపక్షాలకు చెందిన చోటామోటా నాయకులు, వార్డులు, గ్రామాల్లో ప్రభావం చూపకలిగిన వ్యక్తులను వలలో వేసుకోవాలనే వ్యూహా రచనకు పూనుకుంది. అనర్హులకు సర్కారీ తాయిలాలను వర్తింపజేసి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలను ముమ్మురం చేసింది. ఇందుకు అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందే దూ(దు)రాలోచనే కారణం. ఉదాహరణకు సర్కారు దళితబంధు లబ్దిదారులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో రకరకాల యూనిట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఒక కిటుకు అంతర్గతంగా దాగుంది. అధికారులు ఎంపిక చేసిన లబ్దిదారుడితోపాటు మరో ముగ్గురికి అనధికారికంగా అందులో భాగం పంచు తున్నారు. అధికార పార్టీ వారేకాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారినీ ఆకర్షించి పథకాన్ని అక్రమంగా వర్తింపజేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అంటే దళితబంధులో వచ్చే రూ. 10 లక్షలను ఎంపికైన సదరు లబ్దిదారుడుకి రూ. 4 లక్షలు, మరో ఇద్దరికి రూ. 3 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఇందులో లబ్దిదారుడికి రూ. లక్ష ఎక్కువన్న మాట. వాళ్లు ఎంపిక చేసుకున్న యూనిట్లను ఉమ్మడిగా పంచుతూ వచ్చే ఎన్నికల్లో మద్దతు పలకాలనీ, అండగా ఉండాలని ప్రమాణాలు సైతం చేయించుకుంటున్న దుస్థితి. అలాగే బీసీ బంధును సైతం ఇదే పద్ధతిలో అమలుచేస్తున్నారు.
ఎంపికైన లబ్దిదారుడికి వచ్చే రూ. లక్షలో లబ్దిదారుడికి రూ. 50 వేలు, మరో ఇద్దరికి రూ.25 వేల చొప్పున లోపాయకారిగా సర్దుబాటు చేస్తున్నారు. మైనార్టీ బంధునూ ఇలాగే నడిపిస్తున్నట్టు క్షేత్రస్థాయి ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అదనంగా వచ్చే లబ్దిసంగతి పక్కనబెడితే అధికార బీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొనడం గమనార్హం. వచ్చే సాయమే తక్కువైతే, దాన్ని సందట్లో సడేమియాలా ఇతరులకు పంచడం సరికాదని అంటున్నారు. ఇలాంటి లోపాయకారి ఒప్పందాలను అక్కడక్కడా లబ్దిదారులు వ్యతిరేకిస్తున్నారు కూడా. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఈ తరహా ప్రయోగం చేశారు.
ఇది రాష్ట్ర వ్యాప్తంగానూ లేకపోలేదనే సందేహాలూ ఉన్నాయి. ఈ గ్రామంలో ఒక లబ్దిదారుడు తనకు వచ్చిన దళితబంధును ఇతరులకు పంచడానికి నిరాకరించారు. దీంతో సంబంధిత లబ్దిదారుడిని బెదిరించి మరీ లోపాయకారి ఒప్పందానికి బలవంతంగా ఒప్పించారని తెలిసింది. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ అనుకూలురుకు ప్రభుత్వ పథకాలను అందించే పేర అనర్హులకు ఫలహారంలా పంచిపెడుతున్నారు. ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి ఇస్తున్న రూ. 3 లక్షల పథకం గృహలక్ష్మిని సైతం ఇదే తంతు సాగుతోందనే విమర్శలూ లేకపోలేదు.