తోటపల్లి వాగులో అక్రమ ఇసుక రవాణా

– పర్మిషన్ ఉందంటూ వేలాది ట్రిప్పుల తరలింపు
– ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్న గ్రామస్తులు
– పట్టించుకోని  అధికారులు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి వాగులో అక్రమ ఇసుక రవాణ తరలింపులో అడ్డు అదుపు లేకుండా పోయింది. సామాన్య మానవులు ఇంటికోసం ఇసుక కావాలని కోరితే పరిమిషన్ లేదంటున్న అధికారులు తోటపల్లి వాగు నుండి  వేలాది ఇసుక ట్రిప్పుల తరలింపుకు అనుమతులు ఎక్కడివని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. తోటపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా తరలించొద్దని గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను బుధవారం గ్రామస్తులు అడ్డుకొని అధికారులకు సమాచారం ఇచ్చిన రావడంలేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . వాగు నుండి ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు  ఉంటే ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్లాలి ఏ టైంలో తీసుకెళ్లాలనే నిబంధనలు ఉంటాయి కానీ తోటపల్లి వాగు నుండి ఇసుక తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణా దారులకు ఆ నిబంధనలేమి లేకపోవడం పై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజుల తరబడి రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.తోటపల్లి వాగు నుండి ఇసుక తరలింపు పై ఉన్నత అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.