నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో అక్రమ మట్టి రవాణా

– మట్టి మాఫియా చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకొవాలని తహశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సీపీఐ నేత కోడెం స్వామి
నవతెలంగాణ – ఓదెల
నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం సీపీఐ ఓదెల మండల కార్యదర్శి కోడెం స్వామి ఓదెల తాహసిల్దార్ యాకన్న కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కోడెం స్వామి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి చెరువు నుంచి అర్ధ రాత్రి పూట లారీలు, టిప్పర్లలో ఓదెల మండలం లోని కనగర్తి మీదుగా దొంగచాటుగా పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా చేస్తున్నారన్నారు.అనుమతుల పేరిట పొద్దంతా మట్టి రవాణా చేసుకునే అవకాశం ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట తెల్లవార్లు మట్టి తరలించడం ఏమిటని,సంబంధిత అధికారులు పగలు మాత్రమే మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తారు కాని అధికారులు,స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధుల అండతోనే జోరుగా అక్రమ మట్టి రవాణా సాగుతున్నట్లు ఆరోపించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి మాఫీయా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.