– బీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడి
– విజిలెన్స్ ఒకవైపు, కేంద్రం మరోవైపు
– రాజీవ్‌రత్ రిపోర్టు రాగానే క్యాబినెట్‌లో చర్చ ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుపై ఒక్కొక్కటిగా భ్రమలు వీడుతున్నాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పథకంగా చెప్పుకున్న పాత కేసీఆర్ సర్కారు, ఇప్పుడు డిఫెన్స్‌లో పడింది. దీనిపై గత మూడు నెలలుగా చర్చ జరుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి నోరుమెదపకపోవడం గమనార్హం. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఖండిస్తున్నా, వాస్తవాలు వేరేగా ఉన్నాయనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటును పరిశీలించి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నట్టు సమాచారం. మొత్తం పిల్లర్లల్లో 11 పనికిరావనీ, వాటిని కూల్చేసి మళ్లీ నిర్మించాల్సిందేనని విజిలెన్స్ విచారణ సందర్భంగా సాగునీటి శాఖ ఇంజినీర్లు చెప్పినట్టు తెలిసింది. మొత్తం కాళేశ్వరం వ్యవహారంపై సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ‘ వెయిట్ అండ్ సీ’ అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
ఒకరిద్దరు అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు జలసౌధలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) ఒకవైపు పదే పదే ప్రాజెక్టును పరిశీలిస్తుండగా, విజిలెన్స్ అధికారులు మరోవైపు విచారణ చేస్తున్నారు. దీంతో సాగునీటి శాఖ అధికారుల్లో అసహానం పెరుగుతున్నది. తమ తప్పు ఏమీ లేదనీ, గత ప్రభుత్వం చెప్పిన మేరకే డిజైన్లు ఇచ్చామని అంటూ తప్పించుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం లోపభూయిష్టంగా ఉందనే సంగతిని ఇప్పటికే రాజీవ్‌రతన్ నేతృత్వంలోని విజిలెన్స్ బృందం నిర్ధారించినట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో మరోసారి చర్చించి తదుపరి చర్యలకు పూనుకునే అవకాశమున్నట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కాళేశ్వరంపై సమగ్ర, సుదీర్ఘ సమీక్షలు చేస్తున్నారు. ఈ విషయమై నిరంతరం నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే విజిలెన్స్ విచారణ సందర్భంగా కొందరు సాగునీటి శాఖ సీనియర్ ఇంజినీర్లు కీలక సమాచారాన్ని వెల్లడించారనే ప్రచారం జరుగుతున్నది. ఇదిలావుండగా సాగునీటి శాఖ సలహాదారు పెంటారెడ్డి అప్రూవర్‌గా మారినట్టు సాగునీటి శాఖ వర్గాల్లో ప్రచారమైంది. విజిలెన్స్‌కు పూర్తిస్థాయిలో సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై పెంటారెడ్డిని ‘నవతెలంగాణ’ వివరణ కోరగా ‘ కాళేశ్వరం సివిల్ పనులతో నాకు సంబంధం లేదు..నాది పంపులకు సంబంధించిన బాధ్యత మాత్రమే..నేను అప్రూవర్‌గా మారినట్టు వస్తున్న వార్తలు పుకార్లే..వాస్తవం కాదని’ చెప్పారు.
నాపై ఎలాంటి అరోపణలు లేవు, నేనెందుకు అప్రూవర్‌గా మారతాను అంటూ వివరణ ఇచ్చారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుగా ఉన్న శ్రీరామ్ వెదిరే సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. మేడిగడ్డకు సంబంధించి నిర్మాణ వైఫల్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అంటున్నారు. కేంద్ర జలశక్తి శాఖ, ఎన్‌డీఎస్‌ఏ పదే పదే హెచ్చరచిస్తున్నా పాత బీఆర్‌ఎస్ సర్కారు పట్టించుకోలేదని మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం. లక్ష కోట్ల ప్రాజెక్టులో రూ. 3200 కోట్ల మేర అవకతవకలు, అవినీతి జరిగినట్టు విజిలెన్స్ తేల్చిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేదని తెలిసింది. విజిలెన్స్ డీజీ రాజీవ్‌రతన్ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు బాధ్యులెవరనే విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వేగంగా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమమం కానుందని సమాచారం.