కలహాల కాపురంలో ఇమడలేకే..!

Imadaleke in Kapuram of Kahala..!– బీజేపీకి విక్రమ్‌గౌడ్‌ గుడ్‌బై ఆ పార్టీలో అంటరానితనం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు
– నేతల తొత్తులకే పదవుల్లో ప్రాధాన్యమంటూ ఆరోపణ
– ఆయన బాటలోనే రాజేందర్‌, జయసుధ, బండా కార్తీకరెడ్డి !
– మరికొంత మందీ పార్టీని వీడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీకి బిగ్‌షాక్‌ తగిలింది. మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ రాజీనామా చేశారు. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు, పాతకాపులకు మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు మరోమారు తెరపైకి వచ్చింది. పార్టీలో ప్రజాబలం లేని నేతలు పదవుల పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారంటూ, అంటరానితన ముందంటూ తన లేఖలో బాంబు పేల్చటం చర్చనీయాంశమవుతున్నది. క్రమశిక్షణకు బీజేపీ పెట్టింది పేరు అంటూ ఉపన్యాసాలు దంచుతూ పెద్దపెద్ద నాయకులే బహిరంగంగా కొట్టుకుంటున్నా పార్టీ నాయకత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరును ఆయన ఎండగట్టడం ఆ పార్టీ డొల్లతనానికి అద్దం పడుతున్నది. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ రాజీనామాల పర్వం శాంపిల్‌ మాత్రమేననీ, రానున్న కాలంలో మరింత మంది కీలక నేతలు పార్టీని వీడబోతున్నారనే చర్చ నడుస్తున్నది. విక్రమ్‌గౌడ్‌ బాటలోనే సినీనటి మాజీ ఎమ్మెల్యే జయసుధ, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఆ నలుగురు కూడా తమ సొంతగూటి(కాంగ్రెస్‌ పార్టీ)లోకి వెళ్లబోతున్నారని తెలిసింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలూ పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ బీజేపీ నేతల కలహాల కాపురం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.
విక్రమ్‌గౌడ్‌ పార్టీని వీడుతూ కిషన్‌రెడ్డికి రాసిన లేఖనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. ‘పార్టీ నియామావళికి, సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ అప్పగించిన ప్రతి పనిని క్రమశిక్షణతో విజయవవంతంగా పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాను. కానీ, పార్టీ నన్ను ఏ స్థితిలోనూ గుర్తించలేదు….పార్టీ సిద్ధాంతాన్ని కాకుండా కేవలం కొంత మంది నాయకుల వెంట చేరి తొత్తులుగా వ్యవహరిస్తున్న వారికే ఇక్కడ న్యాయం జరిగింది..’ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘బీజేపీ పట్ల నమ్మకంతో పార్టీలో చేరిన వారిని అంటరాని వారిగానే చూస్తున్నారు. ప్రజల్లో కనీస ప్రభావం లేని నాయకులకు పార్టీ పదవులు అంటగట్టి మాలాంటి వారిపై వారు పెత్తనం చెలాయించడం, వారే మా భవిష్యత్తును నిర్ణయించే స్థితిలో ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక లేనివారు…ప్రజల మధ్యకెళ్లి తీర్పుకోరే ధైర్యం లేనివాళ్లు మాలాంటి వారిని ప్రజాక్షేత్రం నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తుంటే పార్టీ నిస్సత్తువుగా మారటం బాధాకరం’ అంటూ బాంబు పేల్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతలు వ్యవహరించిన తీరుపైనా విక్రమ్‌గౌడ్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. టికెట్‌ ఆశించి భంగపడ్డవారితో మాట్లాడి వారికి నచ్చజెప్పాలనే ప్రయత్నం నేతల మధ్య కొరవడటం నాయకత్వ లేమి వల్లనే జరిగిదంటూ కిషన్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ మూడేండ్ల కింద కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం విదితమే. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు తర్వాత గోషామహల్‌లో అన్నీ తానై విక్రమ్‌గౌడ్‌ పార్టీని నడిపించిన సంగతీ తెలిసిందే. తీరా అభ్యర్థుల ప్రకటన సమయంలో విక్రమ్‌గౌడ్‌కు బీజేపీ మొండి చేయి చూపించింది. గోషామహల్‌ టికెట్‌ ఇవ్వకపోయినప్పటికీ అతనితో సంప్రదింపులు జరపాలనే సోయిని బీజేపీ నాయకత్వం మరిచింది. ఇదే విషయం పార్టీకి, ఆయనకు మధ్య దూరాన్ని మరింత పెంచింది. బీజేపీలో బండి సంజరు, ఈటల రాజేందర్‌ గ్రూపుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరును కిషన్‌రెడ్డి గ్రూపు చలిమంటేసి కాపుకుంటున్నదనే విమర్శ ఉంది. రాష్ట్ర, జిల్లా ముఖ్యనాయకులు ముఖ్యనేతలకు భజనపరులుగా మారిపోయారన్న విమర్శలను, పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి నిజమైన కార్యకర్తలు ఈసడించుకుంటున్నారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం జపం ఎత్తుకున్నా అది ఎన్నికల స్టంటేననీ, పార్టీలో కిషన్‌రెడ్డి సామాజిక తరగతి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా ఆ సామాజిక వర్గం నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు.