చిత్ర కళ చుక్కాని మార్చిన

Image art changed the rudderమొగల్‌ చిత్రంతుర్కుల రాకతో మార్పులు చేర్పులతో ముందుకు సాగుతున్న భారతీయ చిత్రకళపై క్రీ.శ. 16వ శతాబ్దంలో మరోపెద్ద అల వచ్చి ముంచెత్తింది. అది మొగల్‌ చక్రవర్తుల ఆగమనం. 3 శతాబ్దాలు భారతదేశంపై రాజ్యం చేసిన మొగలులు, వారితో పాటు వారి లఘు చిత్రకళని, పర్షియన్‌ ఆనవాయితీలనీ తీసుకువచ్చారు. మొగలులు వారి తాహతుకు తగ్గట్టు, చక్రవర్తులైన వారి రాచరికపు గుర్తుగా చిత్రకళని ప్రోత్సహించారు. బారతీయ చిత్రకళ ఈ సమయంలో మరో వైఖరి అందుకుంది.

భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్య నిర్మాణ కర్త జహీరుద్దీన్‌ మొహమ్మద్‌ బాబర్‌. ఉజబెకిస్తాన్‌లో పుట్టి, కాబుల్‌ నుంచి భారతదేశం వచ్చి ఢిల్లీలో ఇబ్రహీంలోడీని జయించి క్రీ.శ. 1526లో భారతదేశంలో మొగలు సామ్రాజ్యం స్థాపించాడు. ఇతను కళాపిపాసి. కళా వివేచకుడు కూడా. ఇతను ‘వాకియత్‌ బాబరి’ అనే పుస్తకం రాసి అందులో ప్రకృతిలోని రకరకాల చెట్లు, పూల గురించి వివరంగా రాసుకున్నాడు. ఇది ఇస్లామ్‌ సాహిత్యంలో మొదటి ఆత్మకథగా గుర్తించబడింది. ఇతను భారతదేశం వచ్చేముందు కాబుల్‌లో రాజ్యం చేస్తున్నప్పుడు క్రీ.శ. 1504 – 1519 మధ్య ‘సూరత్‌ ఖానా’ అనే ఒక ప్రదర్శనశాల కట్టించి దానిని చిత్రాలతో నింపాడు. ఇది ఒక పెద్ద ఉద్యానవనం మధ్య కట్టించాడు. ఆయన వద్ద ఆస్థాన చిత్రకారులు, గ్రంథకర్తలు వుండేవారు. గ్రంథాలను చిత్రాలతో సహా రాయించేవాడు. బాబర్‌ తన ఆత్మకథ రాసిన పుస్తకంలో కొంతమంది కళాకారుల గురించి రాస్తూ, ఎవరి కళ ఎందువలన బాగుంది, ఎవరి చిత్రంలో ఏ చిత్రీకరణ బాగాలేదు అనే విమర్శ కూడా రాసుకున్నాడు.
అతని ఆస్థాన కళాకారులలో మౌలానా మొహమ్మద్‌ మొజహిద్‌ నగిషీలు చెక్కే కళాకారుడట. కమాలుద్దీన్‌ బేజాద్‌ నే పర్షియన్‌ చిత్రకారుడు, చక్కటి నైపుణ్యం వున్న చిత్రకారుడే కానీ అతను చిత్రించే ముఖాలు బాబర్‌కి నచ్చేవి కావట. షాముజఫర్‌ అనే మరో పర్షియన్‌ చిత్రకారుడు చిత్రించే లతలు, జంతువులు, బంగారు గీతలతో చాలా అందంగా చిత్రించేవాడని రాసుకున్నాడు. కళల మీద ఇంత ధ్యాస వున్న ఇతను భారతదేశంలోనూ చిత్రకళకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. ఇతని 4 సంవత్సరాల రాజ్య పాలన తరువాత, క్రీ.శ. 1530 లో ఇతని మరణం తరువాత ఇతని కొడుకు నసీరుద్దీన్‌ మొహమ్మద్‌ హుమయూన్‌ రాజయ్యాడు.
క్రీ.శ. 1530 నుండి క్రీ.శ. 1540 వరకూ హుమయూన్‌ రాజ్యం చేసి షేర్‌ షాసూరి చేతిలో ఓడి 15 సంవత్సరాలు అనామకుడిగా వుండి, ఆపై మళ్ళీ రాజ్యం పొంది క్రీ.శ. 1555 – 56 వరకూ రాజ్యం చేశాడు. ఆ కొద్ది సమయంలో తన రాజ్య సరిహద్దులని పెంచాడు. ఇతని ప్రభావం రాజకీయంగా కంటే కళా ప్రపంచంలో ఎక్కువగా కనిపిస్తుంది. తిరిగి రాజ్యానికి 15 సంవత్సరాల తరువాత వచ్చినప్పుడు ఎంతోమంది పర్షియన్‌ కళాకారులని తన వెంట తీసుకువచ్చాడు. ఇతడు కళా ప్రేమి. బాబర్‌ ఆస్థానంలోని కమాలుద్దీన్‌ బేజాద్‌ అనే కళాకారుడి శిష్యులు దస్త్‌ మొహమ్మద్‌, మౌలానా యూసుఫ్‌, షాముజఫర్‌ శిష్యుడు మౌలానా దర్విష్‌ మీర్‌ సయ్యద్‌, అతని తండ్రి మీర్‌ ముసాఫిర్‌ భారతదేశం వచ్చారు. వీరు రాబోయే కాలాల మొగల్‌ చిత్రకళకు చుక్కానిలా దిశ మార్చారు.
హుమయూన్‌ ఆకస్మిక మరణం తరువాత, అతని 13 సంవత్సరాల కొడుకు జలాలుద్దీన్‌ మొహమ్మద్‌ అక్బర్‌ సింహాసనం ఎక్కాడు. మొగల్‌ సామ్రాజ్యం ఇతని కాలాన్ని సువర్ణాక్షరాలలో రాసుకుంది. ఇతను పుట్టినప్పుడు ఇతని తండ్రి హుమయూన్‌ రాజ్యం కోల్పోయి అనామకుడిగా ఉండడం వల్ల ఇతని విద్యాభ్యాసానికి అవకాశం లేకపోయింది. అలాగే ఇతనికి డిస్‌లెక్సియా అనే లోపం వుండేదనే వాదన వుంది. అందువలన ఇతనికి రాయడం, చదవడం రాదు. ఇతని పట్టు దృశ్యకళలు, సంగీతం, ఇంకోరి చేత చదివించుకుని వినేవాడు. కథలు, విషయాలు చిత్రాలు గీయించి చూసి విషయం గ్రహించేవాడు. ఇతని ఉత్సాహం, జిజ్ఞాస ఎంతో, అంతే ఎక్కువగా ఇతని జ్ఞాపకశక్తి కూడా. ఇతని మాట ప్రకారం చిత్రకారుడు భగవంతుడిని త్వరగా గుర్తిస్తాడు. చిత్రకారుడు తన చిత్రానికి ప్రాణం పోసి చిత్రించాలంటే భగవంతుడు ప్రాణం పోసిన ఈ గొప్ప ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాల్సిందే అంటాడు. ఇతని విషయాలు అక్బరు చరిత్ర రాసిన ‘ఆయినే అక్బరి’ అనే చిత్ర గ్రంథంలో రాయబడ్డాయి. అక్బర్‌ తనవి, తన ఆస్థాన మంత్రులు, మిత్రులు, శత్రువులు, సామంతులు అందరివీ పోట్రేట్‌ చిత్తరువులు వేయించి క్షుణ్ణంగా వాటిని చూసేవాడు. ముఖాలలో వ్యక్తి వునికి, వ్యక్తిత్వం ఉట్టిపడేట్టు చిత్తరువులు గీయించుకుని, వారు ఎలాంటి వ్యక్తులో ఆ చిత్రాల ద్వారా పరిశీలించేవాడట. ఈ చిత్తరువులన్నీ ఆల్బమ్‌ పుస్తకాలలో పొందుపరచేవారు. అబుల్‌ ఫజల్‌ అనే చిత్రకారుడు, ఈ చిత్తరువులు గీయడంలో ఉద్దండుడు. అతను చెప్పిన ప్రకారం ‘తనే కాక చక్రవర్తి తన అనుచరులు అందరివీ చిత్తరువులు వేయించి, వారి రూపాలు శాశ్వతంగా ఆల్బమ్‌లో బంధించాడు’. ఈ మాట కూడా ఆయినే అక్బరిలో రాయబడింది.
క్రీ.శ. 1557 – 58లో అక్బర్‌, తమ మతగురువు అమీర్‌ హమ్జా సాహసపు కథలని ‘హమ్జానామా’ అనే చిత్రాల గ్రంథంగా తన ఆస్థాన కార్ఖానా చిత్రకారులతో వేయించాడు. పెద్ద ప్రమాణంలో వున్న ఈ చిత్రాలు గట్టిగా నేసిన చిక్కటి నూలు వస్త్రంపై 1400 వందల చిత్రాలు చిత్రించడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈ కథలు చదివే కార్యక్రమాలలో ఈ చిత్రాలు ప్రజల కోసం ప్రదర్శించేవారు.
అక్బర్‌ చిత్రశాలలో ఇలాంటి ఎన్నో పెద్ద చిత్రగ్రంథాలు చిత్రించే కార్యక్రమాలు జరుగుతుండడంతో 100 మంది కళాకారులని భర్తీ చేసుకుని వారికి శిక్షణ ఇచ్చారు. వారిలో కొంతమంది పర్షియన్‌ కళాకారులైతే, మొగలులకంటే ముందు భారతదేశంలో వున్న తుర్కు కళాకారులు మరికొంతమంది. అందువలన మొగలు చిత్రాలలో ఆ కళాకారుల పాత శైలి కొంత కనిపిస్తూ వుంటుంది. మొగల్‌ చిత్రాలలో ప్రకృతి దృశ్యాలు, ఎంతో మెళకువగా చిన్న చిన్న వివరాలు చిత్రించడం ప్రాముఖ్యం అందుకుంది. అలలై తేలే నీటిని, నీటి నురగని, గంతులేసే చేప, చేప పిల్లలని, మెత్తగా సాగిపోయే తాబేళ్లు, నోరు తెరచి భయపెట్టే మొసళ్లు, సముద్రపు రాక్షసులు ఎంత వివరంగా చిత్రించేవారో అంత లోతుగా వినోదం, విషాదం వంటి భావాలనూ చిత్రించారు. కుంకుమ, పసుపు, ముదురు ఆకుపచ్చ, ముదురు నేల రంగు వంటి చక్కటి రంగులకూ అంతే వత్తాసు పలికాయి వీరి చిత్రాలు. ప్రతి చిత్రానికీ ముఖ్య చిత్రకారుడు ఒకడై, రేఖల్లో చిత్రం గీస్తే, రంగులు నింపే వాడొకడు, ముఖాలు చిత్రించే కళాకారుడు మరొకడు. చివరికి మళ్లీ పర్యవేక్షించి పూర్తి చేసేది ముఖ్య చిత్రకారుడే.
అక్బర్‌ చిత్రశాలనుండి వచ్చిన చిత్రాలు చూసి మనం ఆనాటి చరిత్ర అర్ధం చేసుకోవచ్చు. కొన్ని చిత్రాలలో వారి రాజమందిరాల పై అంతస్తులలో వున్న చిన్న కిటికీలు తెరవబడి, ఆ కిటికీలు ఒక మనిషి ముఖం మటుకే కనిపించే ప్రమాణంలో అలా మనిషి ఎత్తున చిత్రించబడ్డాయి. వాతావరణంలో నీరెండ అనిపిస్తుంది. బహు:శా చక్రవర్తి ఉదయాస్తమయాలలో అలా కిటికీ తెరిచి కింద నిలుచుని ఎదురు చూసే ప్రజలకి దర్శనమిచ్చి వుంటాడని కళాచరిత్రకారుల వ్యాఖ్య.
బాబర్‌ రాసుకున్న స్వీయచరిత్ర ‘బాబర్‌ నామా’ గా అతని మనుమడు అక్బర్‌ చిత్రాల గ్రంథంగా తిరిగి రాయించాడు. బాబర్‌ ఎంతో చదువుకున్నవాడు. అందువలన అతని గ్రంథంలో ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, రాజనీతి, ఆయుధాలు, ప్రకృతి, వనసంపద, జంతుసంపద, కళలు, సంగీతం, సాహిత్యం వంటి ఎన్నో విషయాల చర్చ వుంది. అక్బర్‌ టూటినామా, పర్షియన్‌ కవితలు, సాహిత్యం చరిత్ర, జీవిత చరిత్రలు, ఎన్నో హిందూ గ్రంథాలకు కూడా అనువాదం చేయించాడు. రాయించాడు. రామాయణ, మహాభారతాలు చిత్రాలతో సహా రాయించాడు. మహాబారత గ్రంథాన్ని ‘రజమ్‌నామా’ (యుద్ధ గ్రంథం) అని చిత్రించారు. క్రీ.శ. 1582 – 86 మధ్య చిత్రించిన ఈ గ్రంథం మొగలు ఆస్థాన గ్రంథాలయంలో మొదటిస్థానం అందుకుంది. క్రీ.శ.1586లో హరివంశపురాణాన్ని, క్రీ.శ. 1586లో రామాయణాన్ని, క్రీ.శ. 1598లో యోగవాసిష్టాన్ని పర్షియా భాషలోకి అనువదించారు. బాబర్‌ పూర్వజులు తైమూర్‌, చెంగీస్‌ ఖాన్‌ వంశజులు. మొగలుల వంశవృక్షం ‘తారీఖే – ఖాన్‌దానీ – తైమూరియా’ అనే పుస్తకం, షానామా (పర్షియన్‌ రాజుల పుస్తకం), దరబ్‌నామా వంటివి చరిత్ర పుస్తకాలూ రాయబడ్డాయి అక్బరు ఆస్థానంలో. అలాగే క్రీ.శ. 1590లో అబుల్‌ ఫజల్‌ అక్బర్‌ విషయాలు ఎన్నో ఆయినే అక్బరిలో రాశాడు. అలాగే అక్బర్‌ తన కోసం కొన్ని కవితల పుస్తకాలను చిత్రాలలో వేయించుకున్నాడు. ‘గులిస్తాన్‌, నిజామి అనే పర్షియన్‌ కవి యొక్క 5 కవితలు ‘ఖామ్సా, బహారిస్థాన్‌ (వసంతం) హఫీజ్‌ మరియు అన్వరిల కవితలు ‘దివాన్స్‌’ అనే చిత్రగ్రంథాలు చూస్తూ కవితలు చదివిన విధంగా ఆనందించేవాడు.
అక్బర్‌ ఆస్థానంలో ‘నవరతన్‌’ అనే 9 మంది దిగ్గజాలు వుండేవారనీ, హాస్యకవి బీర్బల్‌ వుండేవాడని ఎంతో ప్రసిద్ధి. ఎంతగానో ఆ విషయం చర్చించబడింది. అక్బర్‌ పోలిక చెప్పి తరువాత రాజుల విషయాలు మాట్లాడతాం. కానీ ఒక శతాబ్దం ముందే తెలుగు సీమను పాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు వున్నారు. హాస్యకవి తెనాలి రామకృష్ణుడు వున్నాడు. ఆ ప్రాంతీయ రాజు రాజనీతి, మొగలుల ఆస్థానం చేరి వుండవచ్చు. వారూ అదే చేసివుండొచ్చు.
క్రీ.శ. 1580 – 1605 మధ్య పశ్చిమ దేశస్తులు క్రీస్తు సందేశ గ్రంథాలు, చిత్రాల బైబిలు పుస్తకాలు పుచ్చుకుని అక్బర్‌ ఆస్థానం చేరారు. అందులో ఫ్లెమిష్‌, జర్మన్‌ కళాకారుల చిత్రాలు వున్నాయి. పశ్చిమ దేశాల ఆనాటి కళలు, మొగలు శైలి కంటే విరుద్దంగా, చిత్రం నిజమనిపించే రూపంలా దగ్గర, దూరం వస్తువుల భేదం చూపగలిగే శైలిలో చిత్రించేవారు. ఆ కొత్త పద్ధతి చూసి ముగ్ధుడైన అక్బర్‌, వాటికి ప్రతిలిపిలు చిత్రించడానిక కళాకారులను నియమించాడు. ఆనాటి ఆస్థానంలో బసవన్‌, మిస్కిన్‌, కేసుదాసు వంటి కళాకారులకి ఈ చిత్రాలు ఒక ప్రేరేపణ అయినాయి. ఆపై చిత్రించిన మొగల్‌ చిత్రాలలో యూరోపియన్‌ శైలి కన్పించడం మొదలుపెట్టింది. మరికొంతమంది అక్బరు ఆస్థాన ముఖ్య చిత్రకారుల పేర్లలో దశవంత, మనోహర్‌ వంటి పేర్లూ కనిపిస్తాయి. కేసుదాసు దూరపు ప్రకృతి దృశ్యాలు, మానవ ఆకృతులు చక్కగా వేశాడు. తను వేసిన చిత్రాలలో ఒక మూల, పూల కుండీ పైననో, గుబురు కొమ్మల మధ్యనో తన పేరు కూడా రాసేవాడు. మిస్కినా కళాకారుడు ఒక మేక కొండ ఎక్కుతున్నట్టో, చెట్ల వెనుక దాగిన నక్కనో, చెట్టు చివర కొమ్మలపై పచ్చ పిట్టనో వివరంగా చిత్రించేవాడు. ఆ విధంగా మొగలు కళలు అక్బరు చిత్రాల కార్ఖానాలో పెరిగి పెద్దవైనాయి.
– డా||యమ్‌.బాలామణి, 8106713356