ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని అడిగిన పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ పెట్టిన షరతేమిటో తెలుసా? వర్తమాన తరుణం నుంచి 37 నెలల రుణ వాయిదాల కాలంలో 2026 జూన్ నాటికి క్రమంగా వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల ఎత్తివేతను అమలు జరపాలంది. అక్కడి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించాలని చెప్పింది. ఇలాంటి షరతులనే మనకూ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ పెట్టాయి. రైతాంగానికి భయపడి కాంగ్రెస్ పాలకులు వాటిని అమలు జరిపేందుకు సాహసించలేదు. తాయత్తు కట్టుకొని జై భజరంగభళీ అంటూ నరేంద్రమోడీ మూడు సాగు చట్టాల రూపంలో వాటిని రుద్దేందుకు చూశారు. ఫలితాన్ని, పర్యవసానాలను అనుభవిం చటం చూస్తున్నాము. దివాలా స్థితిలో ఉన్న పాకిస్తాన్ను ఆదుకొనేందుకు అమెరికా పైరవీతో ఐఎంఎఫ్ 700 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించింది. దానికి గాను ఒక షరతు పెట్టింది. తమ అప్పు తీరాలంటే రైతులతో సహా ఎవరికీ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకుండా ”పాదుపు” చేయాలంది. దానికి గాను ప్రభుత్వ ఖర్చు తగ్గించాలన్నది. కావాలంటే ప్రభుత్వం తన అవసరాలకు మార్కెట్ ధరలకు కొనుగోలు చేసి అదే ధరలకు విక్రయించాలి తప్ప సబ్సిడీలు కుదరవంది. ఐఎంఎఫ్ షరతు అమల్లోకి వస్తే కనీస మద్దతు ధరలూ ఉండవు, ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యతా ఉండదు. పొదుపు పాటింపులో భాగంగా ఎరువులు, విద్యుత్ తదితర రాయితీలు రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాక్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం గోధుమల సేకరణ నిలిపివేయటంతో బహిరంగ మార్కెట్‌లో 40శాతం ధరలు పడిపోయాయి. తరువాత వంతు చెరకు, పత్తి ధర ప్రకటన విధాన రద్దు అంటున్నారు. వినియోగదారులకు ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ తదితరాలకు దశలవారీ కోత పెడతారు. ఇది పాకిస్తాన్‌కే తప్ప సురక్షితమైన హస్తాలు ఉన్న నరేంద్రమోడీ ఉన్నంత వరకు భారత్‌కు వర్తించదు అని ఎవరైనా అనుకుంటే చేసేదేమీ లేదు.గతంలో 1990దశకంలో తప్ప తరువాత కాలంలో మనదేశం ఐఎంఎఫ్ నుంచి అప్పులు తీసుకోలేదు. ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ పధకాలకు ప్రాజెక్టు రుణాలు తీసుకుంటున్నాం. కుడికన్ను ఎడమ కన్ను తేడా తప్ప రెండు సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు షరతులు షరా మామూలే.మన దేశంలో ఎరువుల ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసి పరిమితంగా కొన్నింటికి సబ్సిడీ విధానం అమలు చేస్తున్నారు. ఎగుమతులకు సబ్సిడీలు ఇవ్వకూడదు దిగుమతుల మీద పన్ను విధించకూడదన్న షరతులు కూడా ఐఎంఎఫ్ విధించింది. మన దేశం కూడా చేస్తున్నది అదే. చిత్రం ఏమిటంటే మన పాలకులు పాకిస్తాన్‌తో కొట్లాడినట్లు జనం ముందు ఫోజు పెడతారు. ఇద్దరిని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ పిలిపించినపుడు వాటి ముందు చెప్పినట్లే చేస్తాం జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకొని నిలబడటం తప్ప వ్యతిరేకించే ధైర్యం లేదు.
అన్ని అవకాశాలూ మూసుకుపోయిన తరువాతనే ఏ దేశమైనా ఐఎంఎఫ్ వద్దకు అప్పుకోసం వెళుతుంది.ఒకసారి తీసుకుంటే దాని రుణ ఊబిలో చిక్కుకున్నట్లే. పాత అప్పులు తీసుకొనేందుకు కొత్త రుణాలు తీసుకోవాల్సిందే.రుణాలు తీసుకున్న దేశాల మీద సర్‌ఛార్జీలు విధించి జలగలా పీల్చుతుంది. ఈ విధానం మీద తీవ్ర విమర్శలు తలెత్తటంతో సర్‌ఛార్జీల రూపంలో వచ్చిన రాబడిని రాయితీలతో కూడిన రుణాలు ఇవ్వటానికి వినియోగిస్తామని చెబుతోంది. ఇది మోసం తప్ప మరొకటి కాదు. తీసుకున్న రుణాల మీద వడ్డీ, సేవారుసుముల మీద అదనపు వసూలునే సర్‌ఛార్జి అంటారు. జనం భాషలో చక్రవడ్డీ. రుణాలు ఎక్కువగా తీసుకోకుండా దేశాలను నిరోధించేందుకే వాటికే విధిస్తున్నామని వితండవాదం చేస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న దేశాలను ఉద్దరించటానికే తాము రుణాలు ఇస్తున్నామని ఐఎంఎఫ్ చెబుతుంది. అదే నిజమైతే ఇప్పటికి 24సార్లు రుణం తీసుకున్న పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడేమిటి ? దాన్ని ఉద్దరించిందీ లేదు, మరోసారి అప్పుకు రాకుండా చూసిందీ లేదు. ఐఎంఎఫ్‌కు చక్రవడ్డీలు చెల్లిస్తున్న ఐదు దేశాల్లో అదొకటిగా మారింది. పాకిస్తాన్ జిడిపిలో 70శాతం మేరకు అప్పులున్నాయి. ప్రభుత్వ ఆదాయంలో 50 నుంచి 60శాతం అసలు, వడ్డీల చెల్లింపులకే పోతోంది. మన ప్రభుత్వ రుణ భారం కూడా వందశాతానికి చేరనుందని ఐఎంఎఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేండ్లలో 22 దేశాల నుంచి ఐఎంఎఫ్ అదనపుబాదుడు 980 కోట్ల డాలర్లు ఉంటుందని, వాటిలో 2024 నుంచి 2033 వరకు ఉక్రెయిన్ 290 కోట్ల డాలర్ల మేర చెల్లించనుందని తేలింది.ధనిక దేశాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిధులు సమకూర్చు కోవాలంటే అదనపు వసూలు తప్పదని సమర్థకులు చెబుతున్నారు. అంటే దివాలా స్థితిలో ఉన్నవాటి దగ్గర వసూలు చేసి ఆ మొత్తాన్నే తిరిగి వడ్డీలకు ఇస్తారన్నమాట, ఈ విధంగా కూడా ధనికదేశాలకు ఐఎంఎఫ్ మేలు చేస్తున్నది.
ఇబ్బందుల్లో ఉన్న 22 దేశాల నుంచి అదనపు బాదుడు ద్వారా ఐఎంఎఫ్‌కు వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంది. అలాంటి దేశాలను రక్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ నిధి చివరికి చక్రవడ్డీ వ్యాపారిలా మారి పీక్కుతింటోంది. 2020లో అదనపు చెల్లింపు దేశాల సంఖ్య పది కాగా కరోనా దెబ్బతో కుదేలై ఐఎంఎఫ్ దగ్గరకు అప్పుకోసం వెళ్లిన మరోపన్నెండు దేశాలు వాటి సరసన చేరాయి. ఈ సంస్థ వడ్డీ రేటు ఒకటి నుంచి ఐదుశాతానికి పెరగ్గా, సర్‌ఛార్జి చెల్లించే దేశాలకు అది 7.8శాతంగా ఉంటోంది. అందువలన ఈ దేశాలు అప్పుల ఊబినుంచి బయటపడే అవకాశమే లేదని అనేక మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ అప్పు, వడ్డీ చెల్లించటానికి ఆ దేశాల పాలకులు జనాన్ని పీక్కు తింటారు. ఈ క్రమంలో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మానవహక్కుల పరిశీలన సంస్థ(హ్యూమన్ రైట్స్ వాచ్) ఏడాది క్రితం ” బుల్లెట్ గాయంపై బాండేజ్ ” పేరుతో 131పేజీల నివేదికలో వెల్లడించింది. ఐఎంఎఫ్ షరతులు అనేక సంక్లిష్ట పరిస్థితులను సృష్టించటమేగాక అసమానతలను కూడా పెంచుతున్నాయని చెప్పింది.
2020 మార్చి నెల నుంచి 2023 మార్చి నెల వరకు 110 కోట్ల జనాభా ఉన్న 38దేశాలకు ఇచ్చిన రుణాలను ఆ నివేదికలో విశ్లేషించారు. పొదుపు షరతులే అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, రాబడి పెరిగే కొద్దీ మధ్యతరగతి, ధనికులు చెల్లించాల్సిన పన్ను రేటు తగ్గింపు, తక్కువ ఆదాయం వచ్చేవారి మీద పన్ను పెంపు విధానాలను అది రుద్దుతున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో జనం ఆందోళనలకు దిగుతున్నారు. ఈ షరతుల వలన ఆయా దేశాల రుణ దామాషాలు తగ్గటం లేదని స్వయంగా ఆ సంస్థ నివేదికలోనే పేర్కొన్నారు. దాని 39 ప్రాజెక్టులను సమీక్షించగా 32లో ఏదో ఒక ఆదేశం లేదా షరతు మానవహక్కులను ఉల్లంఘించేదిగా ఉందని తేలింది. ఇరవై రెండింటిలో ప్రభుత్వ వేతన బిల్లు తగ్గించేందుకు వేతన స్థంభన, వేతన పరిమితి లేదా తగ్గింపు షరతులు ఉన్నాయి.ఇరవై మూడు ఉదంతాలల్లో వ్యాట్ పెంచాలనే ఆదేశాలున్నాయి. ఇరవై ప్రాజెక్టుల్లో ఇంథనం, విద్యుత్ సబ్సిడీల తగ్గింపు, సామాజిక భద్రతా పథకాల ఖర్చు తగ్గింపు వంటివి ఉన్నాయి. మన దేశంలో నరేంద్రమోడీ సర్కార్ పెట్రోలు, డీజిలు మీద పెద్ద మొత్తంలో సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.
విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలపై ఖర్చు తగ్గించటం, ప్రభుత్వాలు ఆ రంగాల నుంచి వైదొలగటం లేదా నామమాత్రంగా ఉండాలన్నది ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు చెప్పే సలహాలు లేదా ఆ ముసుగులో ఆదేశాలు ఉంటాయి. ఈ రెండు సంస్థలను బ్రెట్టన్ ఉడ్ కవలలు అంటారు. ఎందుకంటే ఒకే దగ్గర అవి రూపుదిద్దుకున్నాయి.నాణానికి బొమ్మ బొరుసు వంటివి. రెండూ వేర్వేరుగా ఉన్నప్పటికీ సమన్వయంతో పనిచేస్తాయి. దేశాల మీద ఆదేశాలను రుద్దుతాయి. వాటి దగ్గరకు వెళ్లక ముందు మన దేశంలో రోడ్లకు టోల్‌టాక్సు, సెస్‌లు, వినియోగదారుల రుసుముల వంటి భారాలు లేవు. పెట్రోలు, డీజిలు మీద భారీగా ఒకవైపు పన్నులు సెస్‌ల వడ్డింపు, వాహనాలకు జీవితకాల పన్ను, మరోవైపు అవి రోడ్ల మీద తిరిగితే టోల్‌టాక్సు. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు.
ఐఎంఎఫ్ విధానాలను అమలు జరిపిన జోర్డాన్ పరిస్థితిని మానవహక్కుల సంస్థ విశ్లేషించింది.2011 నుంచి 2017 మధ్య అక్కడ వృద్ధాప్య పెన్షన్ల వంటి సామాజిక భద్రతా బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించారు. ఇంధనం, రొట్టెల మీద ఉన్న సబ్సిడీలను(మనదేశంలో పెట్రోలు,డీజిలు, గ్యాస్ మాదిరి) ఎత్తేశారు.తద్వారా ఆరు సంవత్సరాల్లో 110 కోట్ల డాలర్లను పొదుపు చేశారు.కోటీ పది లక్షల మంది జనాభాకు గాను కేవలం లక్షా ఇరవై వేల మందికి 2019లో ప్రపంచ బ్యాంకు సహకారంతో ఐఎంఎఫ్ పధకాల్లో నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టారు.తమకూ వర్తింపచేయాలని కోరిన వారిని వేధించారు, అణచివేశారు. 2018 నుంచి 2022 కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 15 నుంచి 24శాతానికి పెరిగారు. దరఖాస్తు చేసుకున్న అత్యధికులకు తిరస్కరించారు. కేంద్రం అనుమతి ఇవ్వని కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పదేండ్లుగా కొత్తగా తెల్లరేషన్ కార్డుల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఇదీ మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది.
సత్య