జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి

– రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంపై ఆయా పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి ఉధృతి, వరద పరిస్థితులపై శనివారం ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మరింత ముమ్మరం చేయాలన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాలు కురుస్తున్న ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించా లని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ సంబంధిత చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌ బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ విభాగం నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలనీ, ఆ విభాగంలో అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.