గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలి

Immediate ceasefire in Gaza– న్యూయార్క్‌ టైమ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద మీడియా సిబ్బంది ధర్నా
న్యూయార్క్‌ : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరుతూ న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రధాన కార్యాలయం వద్ద మీడియా సిబ్బంది గురువారం ధర్నా నిర్వహించారు. హమస్‌పై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న సైనిక చర్యల కవరేజీ పట్ల మీడియాలో ఒక వర్గం పక్షపాతం వహిస్తోందంటూ వారు ఆరోపించారు. మాన్‌హటన్‌ హెడ్‌క్వార్టర్స్‌ వెలుపల జరిగిన ధర్నాలో వందలాదిమంది పాల్గొన్నారు. గాజాలో మరణించిన వేలాదిమంది పాలస్తీనియన్ల పేర్లను ప్రదర్శకులు చదివి వినిపించారు. యుద్ధం ఆరంభమైనప్పటి నుండి కనీసం 36మంది జర్నలిస్టులు మరణించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో కాల్పుల విరమణకు బహిరంగంగా మద్దతు ప్రకటించాలంటూ టైమ్స్‌ ఎడిటోరియల్‌ బోర్డును వారు కోరారు.
విచక్షణారహితంగా జరుగుతున్న మారణకాండలో ఒక పక్షం మీడియా కూడా కుమ్మక్కవుతోందని విమర్శించారు. న్యూయార్క్‌లో పలు చోట్ల పాలస్తీనియన్లకు మద్దతుగా జరిగిన కార్యాచరణలో భాగంగా ఈ ధర్నా జరిగింది. జూయిస్‌ వాయిస్‌ ఫర్‌ పీస్‌ గ్రూపు కార్యకర్తలు మంగళవారం స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని ఎక్కారు. కాల్పుల విరమణ తక్షణమే జరగాలని డిమాండ్‌ చేస్తూ గ్రాండ్‌ సెంట్రల్‌ టెర్మినల్‌లో కమ్యూటింగ్‌ కేంద్రాన్ని మూసివేశారు.