– మాజీ మంత్రి సుద్దాల దేవయ్య
నవతెలంగాణ – గంగాధర: కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ భూ నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య డిమాండ్ చేశారు. గంగాధర మండలం రంగారావుపల్లి, తాడిజెర్రి గ్రామాల ప్రజలు, రైతులకు సంబంధించిన వేలాది ఎకరాల భూములు కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో కోల్పోతున్నారని అన్నారు. భూములు కోల్పోయి ఓ వైపు పరిహారం అందక మరో వైపు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నష్టపరిహారం చెల్లింపు కోసం ప్రభుత్వం, అధికారులు డిసెంబర్ లో సంతకాలు సేకరించి జనవరిలో నష్టపరిహారం చెల్లిస్తామని నేటికి చెల్లింపులు చేయక తాత్సారం చేయడం ఏంటని సుద్దాల దేవయ్య ప్రశ్నించారు. పరిహారం కోసం రైతులు ఆందోళననకు దిగిన అధికారులు, ప్రభుత్వంలో చలనంలేక పోవడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు.నష్ట పరిహారం రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న నిర్వాసితులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సుద్దాల భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఎప్పటి లోగా చెల్లిస్తారని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్ తో ఫోన్లో మాట్లాడుతూ ప్రశ్నించారు. జనవరిలో చెల్లించాల్సిన నష్టపరిహారం వెంటనే నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. దీంతో 15 రోజుల్లో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామవి ఆర్డీవో ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లింపు చేయకపోతే 16 వ తేదీ ఆర్డీవో ఆఫీస్ ముట్టడిస్తామని సుద్దాల హెచ్చరించారు. మాజీ మంత్రి దేవయ్య వెంట మండల నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.