అడవుల్లో పులులుంటయి. ఊళ్ళల్లో మనుషులు ఉంటారు. మనుషుల్లో పులుల్లాంటి వాళ్ళుండవచ్చు కానీ వాళ్ళని మనుషులనే అంటారు. అడవుల్లో ఉండే పులుల్ని క్రూరమృగాలు అంటారు. ఊళ్ళల్లో క్రూరమృగాల్లాంటి మనుషులు ఉండవచ్చు కానీ వాళ్ళని మనుషులనే అంటారు.
అడవుల్లో ఉండే పులులు, ఊళ్ళల్లో ఉండే పులులకి పోటీగా ఊళ్ళల్లోకి రాకూడదు. కానీ అడవిలో ఉండే పులి ఒక్కటి దారి తప్పి ఊళ్ళోకి వచ్చిందన్న వార్త గుప్పుమంది. పులిముందు వచ్చిందో పుకారు ముందు వచ్చిందో ఎవరు చెప్పగలరు.
పసుపు పచ్చని కోటు మీద నల్లని చారల కోటు వేసుకునున్న పులి ఊళ్ళో తిరుగుతున్నదని ఒకరన్నారని ఇంకొకరు. ఇంకొకరన్నారని మరికొందరు మరికొందరన్నారని అనేకమంది అదే పనిగా గాలిగత్తర చేశారు. పులి తొమ్మిదడుగుల పొడుగుందని కొందరు, పులి తోక రెండు మీటర్ల పొడవుందని ఇంకొందరు కొలవకుండానే కొలిచినట్టు జనానికి తెలిసేట్టు చేసి హడలెత్తించారు.
ఒక అపార్టుమెంటు గేటు దగ్గర పులిని చూశానన్నాడొకడు. బస్‌స్టాప్‌లో బస్సు కోసం చూస్తూ కూచుంటే బస్సు రాలేదు కానీ పులి వచ్చిందన్నాడింకొకడు.
ఇలా ఎలా పడితే అలా అలా అలా పులికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఊళ్ళో వాడవాడల్లా దోమల మందు వాసనలా వ్యాపించేయి. కొందరయితే అదిగో పులి అని అరిస్తే, కొందరు ఇదిగో తోక అని కూడా అరిగి గీ పెట్టారు, అక్కడికి పులి ఓ చోటా దాని తోక ఇంకో చోటా ఉన్నట్టు.
పులుల్లాంటి మనుషులున్నా పైకి గోళ్ళూ, కోరలూ కనిపించవు కనుక మనుషులు భయం లేకుండా ఊళ్ళో బతుకగల్గుతున్నారు. కానీ ప్రతిని చూడగానే పులి అని తెలిసిపోయి నిద్రపోలేరు కదా, అరచేతిలో ప్రాణాల బరువు అట్టే సేపు మోయలేరు కదా అందువల్ల విషయం ఊరి పెద్దల దాకా పోయింది. ఊరి పెద్ద మనుషులంతా పెద్ద మఱ్ణి చెట్టు కిందకు చేరారు.
ఊరి పెద్దలందరికీ ఊళ్ళో జనం ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. పులి నోటికే కోళ్ళూ, గొఱ్ఱెలూ, ఆఖరికి ఆవులూ చిక్కితే చిక్కినయి కానీ ఒక్క మనిషి ప్రాణం కూడా పోవడానికి వీల్లేదన్నారు. మిగతా వాటి ప్రాణాలు మనిషి ప్రాణాలతో పోలిస్తే ఏమాత్రం లెక్కకి రావు అన్నారు. పులి ఎక్కడెక్కడ తిరిగిందీ, ఎవరెవరు చూసిందీ కూపీ లాగారు.
పులి కనిపించిందట అనేవాళ్ళే కాని కనిపించింది అన్న వాడు లేడు. పులిని చూశాడట అన్న వాడే కాని చూశాను అన్నవాడు లేడు. ఒక్కడంటే ఒక్కడు కూడా పులి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశానన్నవాడు లేడు. పులికి షేక్ హేండిచ్చిన వాడు ఒక్కడూ ముందుకు రాలేదు.
అడిగిందే అడిగి విసిగిపోయారు ఊరి పెద్దలు. చెప్పిందే చెప్పి నీరసపడిపోయారు మామూలు మనుషులు. యూట్యూబర్లందరినీ పెడరెక్కలు కట్టేసి లాక్కురమన్నారు పెద్దలు. ఊళ్ళో ఒక్కడూ లేడని అంతా కట్టుకుని కెమెరాలు నెత్తిన పెట్టుకుని అడవిలోకి వెళ్ళేరని తెల్సింది.
లేని పులిని రాని పులిని ఊళ్ళోకి తెచ్చి ఇప్పుడు అడవిలోకి సాగనంపటానికి వెళ్ళినట్టున్నారన్నారు కొందరు. పులీ లేదు గిలీ లేదు, పులీ లేదు పుట్రా లేదు అని అరిచారు అందరు అయితే ఈ మాటని పట్టించుకోలేదు పెద్దలు. నిప్పు లేనిదే పొగరాదు అన్నారు. పొగపెడితే కాని పులి పోదు అన్నారు. మనుషులకన్నా పులి క్రూరజంతువు అన్నారు. మనిషి కనబడితే పులి వదలనే వదలదు అన్నారు పెద్దలు. పులి అజాపజా తెల్సుకుని కాని వదలం. పులి సంగతి తాడో పేడో తేల్చుకుని కాని వదిలేదు అని భీష్మించు క్కూచున్నారు పెద్దలు.
ఊళ్ళో పెద్దలు రచ్చబండ దగ్గరికి చేరి ఊరి సమస్యలకు పరిష్కారం చూపాలి కాని గాలి కబుర్ల గురించీ, ఉత్తపుకార్ల గురించీ అవాకులు అల్లీ, చెవాకులు చేర్చీ మీసాలు తిప్పడం కాదు అని అక్కడ చేరిన మామూలు మనుషుల్లోంచి అరిచాడొకడు. అసలు ఊళ్ళో ఉన్న బడిపిల్లల హాస్టల్లో విషాహారం తిని ఆసుపత్రి పాలైన వాళ్ళ గురించి మాట్లాడరేం అని మొత్తుకున్నాడొకడు. మొన్నీ మధ్య అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతుల మాటే ఎత్తరేం అని ఒకరంటే కాలేజీల్లో చదువుకని వెళ్ళిన వాళ్ళ ఆత్మహత్యల గురించి పట్టించుకోరా అని మరొకరన్నారు!
ఎవరెట్లా చావాలో పైవాడు ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటాడు గనుక, మనం చేయగలిగిందేమీ లేదు, ఉండదు. స్కూల్ పిల్లలు, కాలేజీ పోరలు చచ్చినా, రైతులు చెట్లకు వేళ్ళాడిన అవి సర్కారీ హత్యలే కాని మనుషులు చేసినవి కాదు. మనుషులు చేస్తే హత్యలు నేరాలవుతాయి కాని సర్కారీ హత్యలు హత్యలే కావు వాటికి బాధ్యులు ఎవరూ కాదు. సర్కారు మీద నేరాలూ ఉండవు. శిక్షలూ ఉండవు. అలాగని సర్కారు చేతులు ముడ్చుకు కూచోదు. ఊళ్ళోకి పులి వస్తే ఊరుకోదు. పులుల నుంచి మనుషుల ప్రాణాలు కాపాడుతుంది.
అసలు పులే లేదంటుంటే, పుకార్ల గురించి పట్టించుకోవద్దంటుంటే అనరిచాడెక్కడ్నుంచో ఓ బుద్ధి తక్కువ వెధవ.
ఎవడ్రా వాడు? ఉతికి ఆరేస్తా అన్నాడు ఊరి పెద్ద. ఉతికించుకుని ఆరేయించుకునే ఇష్టం లేని వాడు మనకెందుకని ఊరికే ఉన్నాడు.
ఊళ్ళో పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నమాట నిజమే కాని ముందస్తుగా పులి సంగతి తేలుస్తాం. అసలు పులి ఊళ్ళోకి వచ్చిందో లేదో తెల్సుకుంటాం. అదే ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం అన్నాడు ఊరి పెద్ద, జనం చప్పట్ల మధ్య.
చింతపట్ల సుదర్శన్
9299809212