– అంతర్జాతీయ సమాజం నుంచి పెరుగుతున్న ఒత్తిడి
– మరింత మందిని విడుదల చేస్తే పొడిగిస్తాం : ఇజ్రాయిల్
– కొనసాగుతున్న చర్చలు
– ఇజ్రాయిల్ అదుపులో మరో 60మంది పాలస్తీనియన్లు
గాజా, జెరూసలెం : గాజాలో కాల్పుల విరమణకు చివరి రోజైన సోమవారం శాశ్వత కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ఈజిప్ట్, ఖతార్, అమెరికా శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయిల్‌ను కోరుతున్నాయి. గాజాలోని ఇజ్రాయిల్ బలగాలనుద్దేశించి ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, ”ఏదీ మనల్ని అడ్డుకోలేదు” అని వ్యాఖ్యానించారు. ప్రతి పదిమంది బందీల విడుదలకు ఒక్కో రోజును పొడిగిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు నెతన్యాహు తెలియజేశారు. గాజాలో ఏడు వారాలుగా ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడుల్లో14,854మంది పాలస్తీనియన్లు మరణించారు. 37వేల మంది దాకా గాయపడ్డారు. మరో 6,800 మంది అతీగతి తెలీదు. వారు చనిపోవడమో, కూలిపోయిన భవన శిథిలాల కింద సమాధి కావడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, మసీదులు, శరణార్థి శిబిరాలు, బేకరీలు, ఇతర మౌలిక సదుపాయాలు ఇజ్రాయిల్ బాంబుదాడుల్లో నాశనమయ్యాయి.
కాల్పుల విరమణను పొడిగించేందుకు కతార్, ఈజిప్ట్, అమెరికా, ఇయు, స్పెయిన్ కృషి చేస్తున్నాయని పాలస్తీనా అథారిటీ తెలిపింది. మరో మూడు రోజులు వరకూ పొడిగించే అవకాశం వుందని, అయితే ఇది ఎంతకాలమనేది కచ్చితంగా చెప్పలేమని పాలస్తీనా అథారిటీ విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలిక్ తెలిపారు. కాల్పుల విరమణ సుదీర్ఘకాలం అమల్లో వుంటే తప్ప గాజాలో పరిస్థితులు అదుపులోకి రావని పాలస్తీనా శరణార్ధుల కోసం పనిచేసే ఐక్యరాజ్య సమితి సంస్థ వ్యాఖ్యానించింది. శాశ్వత కాల్పుల విరమణ జరగాలని ఇరాన్ కూడా కోరింది. పాలస్తీనియన్లపై యూదుల నేరాలు పూర్తిగా ఆగిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ కానాని పేర్కొన్నారు.
గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంపై చర్చించేందుకు యురోపియన్, అరబ్ దేశాల ప్రతినిధులు బార్సిలోనాలో సమావేశమయ్యారు. 42 ప్రతినిధి బృందాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
మరో 60మంది అదుపులోకి
కాల్పుల విరమణ నాల్గవ రోజైన సోమవారం విడుదలవ్వాల్సిన బందీలు, ఖైదీల జాబితాను ఇరు పక్షాలు మార్పిడి చేసుకున్నాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో గత రాత్రి మరో 60మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ బలగాలు అరెస్టు చేశాయని పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్ వెల్లడించింది. వీరిలో కొంతమంది మాజీ ఖైదీలు కూడా వున్నారని తెలిపింది. అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మూడు వేల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ బలగాలు నిర్బంధించాయి. ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇజ్రాయిల్‌లోని హమాస్ దాడి చేసిన ప్రాంతాల్లో ప్రధాని నెతన్యాహుతో కలిసి పర్యటించారు. హత్యాకాండకు దారితీసే ప్రచారాన్ని ఆపాలని ఆయన నెతన్యాహుకు సలహా ఇచ్చారు. హమాస్‌ను నాశనం చేయాలని నెతన్యాహు చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ సలహా ఇచ్చారు.
పాలస్తీనాకు సంఘీభావంగా బ్రిటన్‌లో ర్యాలీల హోరు
లండన్: గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించాలంటూ బ్రిటన్ అంతటా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నినదించారు. గత ఏడు వారాలుగా క్రమం తప్పకుండా వారాంతంలో రెండు రోజుల పాటు పాలస్తీనా సంఘీభావ ర్యాలీలతో బ్రిటన్ హోరెత్తుతోంది. శని, ఆదివారాల్లో లండన్, గ్లాస్గో, మాంచెస్టర్, లీడ్స్ ఎడిన్‌బర్గ్, ఇతర ముఖ్య పట్టణాల్లో వేలాది మందితో ర్యాలీలు జరిగాయి. అమెరికా, బ్రిటన్, ఇతర సామ్రాజ్యవాదుల పూర్తి మద్దతుతో నెతన్యాహు ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధ నేరాలను ఖండిస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారు. గాజాలో ఇజ్రాయిల్ నరమేధంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం ఈ ర్యాలీల్లో ప్రతిబింబించింది. బ్యాంకులన్నీ మూతపడ్డాయి. పాలస్తీనాకు సంఘీభావంగా యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇందుకు అభినందించాల్సింది పోయి, యూనివర్సిటీల పాలకవర్గాలు అణచివేత చర్యలకు పాల్పడ్డాయి. సంఘీభావ ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థి గ్రూపులను సస్పెండ్ చేశాయి. పాలకవర్గాల చర్యను నిరసిస్తూ అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు క్యాంపస్‌లలో ఆందోళనకు దిగారు. వారు ఏం చేశారన్నదాంతో నిమిత్తం లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే నిరంకుశ అధికారాన్ని ప్రభుత్వం పోలీసులకు ఇచ్చింది. దీంతో సెక్షన్12 కింద లండన్‌లో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం, ఇజ్రాయిల్ అనుకూలవాదులు నిరసనకారులపై జాతి విద్వేషకులన్న ముద్ర వేస్తున్నాయి. సిరియాలోని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయిల్ దాడిని రష్యా ఖండించింది. ఇది రెచ్చగొట్టే చర్య అని రష్యన్ విదేశాంగ మంత్రి మేరియా జఖరొవ్ పేర్కొన్నారు.
జర్నలిస్టులపై ఊచకోతను ఆపండి
అంతర్జాతీయ జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ డిమాండ్
పాలస్తీనా జర్నలిస్టులపై ఇజ్రాయిల్ సాగిస్తున్న ఊచకోతను వెంటనే ఆపాలని అంతర్జాతీయ జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. అక్టోబరు 7 నుంచి ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడుల్లో 63 మంది పాలస్తీనా జర్నలిస్టులు గాజా, వెస్ట్‌బ్యాంక్‌ల్లో చనిపోయారు. ఈ ఊచకోతలో అమెరికా పాత్ర కూడా ఉందని కమిటీ పేర్కొంది. జర్నలిస్టులపై నెతన్యాహు ప్రభుత్వం సాగిస్తున్న ఈ దాడులు పత్రికా స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులకు పూర్తి విరుద్ధమని కమిటీ పేర్కొంది.