మరణం లేని మహానేత అంబేద్కర్‌

మరణం లేని మహానేత అంబేద్కర్‌– సామాజిక సమతా భారీ సభలో ఏపీ సీఎం
– విజయవాడలో 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ
విజయవాడ: సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తున్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్‌ ప్రసంగించారు. విజయవాడ నగర నడిబొడ్డున 404 కోట్ల వ్యయంతో 125 అడుగుల అతి భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జగన్‌ శుక్రవారం ప్రసంగించారు. ఇది పేదల హక్కులకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని జగన్‌ అన్నారు. దళిత వర్గాలకు బలహీన వర్గాలకు అంబేద్కర్‌ గొంతుకగా నిలిచారని.. మరణం లేని మహానేత అంబేద్కర్‌ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ‘అంటరానితనం తన రూపం మార్చుకుందని.. పేదలను దూరంగా ఉంచడం మాత్రమే అంటరానితనం కాదన్నారు. పేదవారు ఇంగ్లీష్‌ మీడియం చదవొద్దని కోరుకోవడం కూడా అంటరానితనమేనన్నారు.
పేదలు తెలుగు మీడియంలోనే చదవాలనడం వివక్ష కాదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారు కోరుకుంటున్నారని.. పథకాల అమలులోనూ వివక్ష చూపడం అంటరానితనమేనన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం జగన్‌ వెల్లడించారు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. దళితులంటే చంద్రబాబుకు నచ్చరని ఆయన చెప్పారు. పెత్తందారి పార్టీలకు పెత్తందారి నేతలకు పేదలు పట్టరని విమర్శించారు. ‘వైసీపీ నుంచి శాసనమండలిలో 29 మంది సభ్యులు బలహీనవర్గాల వారేనని.. 8 మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం ఎస్సీ, బీసీలే.. 13 జడ్పీ చైర్మెన్లలో 9 మంది బలహీనవర్గాల వారే.. ఇలాంటి సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో తప్పితే ఎక్కడైనా చూశారా?.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు’ అని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.