‘కృత్రిమ మేధస్సు’- యువతపై ప్రభావం!

చాలా కాలం నుండి కృత్రిమ మేధస్సు గురించి చర్చ జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో దీని గురించి ఎక్కువగా వింటున్నాం. అనేక సంస్థలు తమ కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడటం, అలాగే చాట్‌ జిపిటి వంటివి అందుబాటులోకి రావటం ఈ చర్చ వేడిని పెంచింది. గత వారం మైక్రోసాఫ్ట్‌ కూడా ఓపెన్‌ పైలెట్‌ అని తన కృత్రిమ మేధ గురించి ప్రపంచానికి చెప్పింది. అలాగే గూగుల్‌, మెటా వంటి అనేక దిగ్గజాలు కూడా కృత్రిమ మేధస్సు అభివృద్ధిపరచటంలో చాలా కాలం నుంచి పని చేస్తున్నాయి. తొందరలో అవి కూడా తమ వాటిని మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చు. కృత్రిమ మేధస్సు (ఏ.ఐ) వేగవంతమైన అభివృద్ధి ఉపాధి మార్కెట్‌పై, ముఖ్యంగా యువతరంపై దాని ప్రభావం గురించి ఆందోళనలను పెరుగుతున్నాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, 2025 నాటికి అన్ని పనులలో సగానికిపైగా యంత్రాల ద్వారా నిర్వహించబడతాయని, చాలా మంది కార్మికులకు ఉద్యోగాలు లేకుండా పోతాయని అంచనా వేసింది. నేటి పోటీ ఉద్యోగ విపణిలో ఇప్పటికే పని దొరక్క ఇబ్బందులు పడుతున్న యువతకు ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైల్‌, హాస్పిటాలిటీ, తయారీ రంగాలలో జాబ్‌ మార్కెట్‌పై కృత్రిమ మేధస్సు ప్రభావం అధికంగా ఉండవచ్చు. తక్కువ నైపుణ్యం ఉన్న స్థానాల్లోని కార్మికులు ఈ మార్పు వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఏ.ఐ పెరుగుదల కొత్త ఉద్యోగ అవకాశాలను సష్టించగలదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఉద్యోగాలకు ప్రస్తుతం చాలా మంది యువకులకు లేని సాంకేతిక నైపుణ్యం అవసరం అవ్వవచ్చు. అందుచేత, ఏ.ఐ ప్రయోజనాలు అధిక నైపుణ్యం కలిగిన కొద్దిమంది కార్మికుల సమూహంలో కేంద్రీకృతమై… మెజారిటీ కార్మికులు ఉపాధి కోల్పోవటానికి అవకాశం ఉంది.
కృత్రిమ మేధస్సు వలన ఇప్పుడున్న చాలామంది కార్మికుల జీతాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది (ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుంది). ఎందుకంటే ఒక పని చేయటానికి కార్మికుడికి కావలసిన నైపుణ్యం యంత్రానికి మరింత బదలాయించబడుతుంది గనుక. ఒక కార్మికుడికి ఇప్పుడు కావాల్సింది కృత్రిమ మేధను ఎలా ఉపయోగించా లనేది తెలియటమే. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు ఇప్పుడు తన పనిలో భాగంగా కోడ్‌ రాస్తాడు. కృత్రిమ మేధ వచ్చిన తరువాత ఈ బాధ్యత చాలా వరకు యంత్రానికి బదలాయించబడుతుంది. కార్మికుడు చేయవలసిందల్లా ఏ.ఐ ఇచ్చిన కోడ్‌ను కొంత పరిశీలించటం, వాడుకొనటం. ఇలా అన్ని రంగాలలో కార్మికుల విధులు ఇదే విధంగా యంత్రానికి మరింత బదలాయించబడతాయి. ఈ ప్రక్రియ ప్రతి పారిశ్రామిక విప్లవం జరిగినప్పుడు జరిగేదే కానీ ఈ కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు అంతిమంగా మెజారిటీ ప్రజలయిన కార్మికులకు బదలాయించపడ తాయా లేదా గుప్పెడు కార్పొరేట్లకా అనేదే ప్రశ్న. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు తగ్గి, ప్రయివేటు యాజమాన్యం ప్రతి రంగంలో బలీయమయిన శక్తిగా మారిన ఈ రోజుల్లో ఏ.ఐ పెరుగుదల పని పరిస్థితులపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. యంత్రాలు ఎక్కువగా ప్రబలంగా మారడంతో, కార్మికుల భద్రత, శ్రేయస్సు కంటే కంపెనీలు వారి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సవాళ్లకు ప్రతిస్పందనగా, అనేక సంస్థలు, ప్రభుత్వం భవిష్యత్తులో ఉద్యోగాల కోసం కార్మికులను సిద్ధం చేయడానికి విద్య, శిక్షణ కార్యక్రమాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. యంత్రాల ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో యువత అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా, ఏ.ఐ ప్రయోజనాలు సమాజం అంతటా సమానంగా పంపిణీ చేయబడాలంటే ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది.
అలాగే ప్రయివేటురంగ పరిశ్రమలపై ప్రభుత్వం గణనీయమైన పట్టు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సాంకేతికత వల్ల చేకూరే ప్రయోజనాలు సమానంగా పంపిణీ చేయబడతాయి. లేనిపక్షంలో ఇప్పుడున్న అసమానతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. యంత్రాల పెరుగుదల అనేక ప్రయోజనాలను తెచ్చిపెట్టినప్పటికీ కార్మికులపై, ముఖ్యంగా యువకులపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడం, వారు వెనుకబడిపోకుండా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. విద్య, శిక్షణ కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, భవిష్యత్‌ సవాళ్లు, అవకాశాల కోసం తరువాతి తరాన్ని సిద్ధం చేయవచ్చు. అంతిమంగా పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలు మానవులను ఒక సంతోష కరమైన సమసమాజం వైపు నడిపించాలి. అంతేకానీ మరింత అసమానతలు, దోపిడీ పెంచకూడదు. చరిత్ర చూసుకున్నట్లైతే ఇప్పుడున్న వ్యవస్థ సాంకేతిక విప్లవ ప్రయోజనాలను సాధారణ ప్రజలకంటే కొంతమంది పరిశ్రమాధి పతులకు, పాలకులకు మాత్రమే ఎక్కువగా బదలాయించింది. తదనణుగుణంగా సమాజంలో అసమానతలు, పేదరికం, దుఃఖం తీవ్రమైంది. ఈ కృత్రిమ మేధస్సు అయినా మెజారిటీ ప్రజల ప్రయోజనాల వైపు బదలాయించ బడాలంటే ఇప్పుడున్న అసమాన న్యాయంతో కూడిన వ్యవస్థ స్థానంలో మరింత మెరుగైన సామ్యవాద వ్యవస్థ స్థాపన దిశగా ప్రయాణం సాగించాలి.
– ఆంజనేయరాజు